సరికొత్త బిజినెస్.. గోధుమ పొట్టుతో ఫుడ్ కంటైనర్లు.. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం

సరికొత్త బిజినెస్.. గోధుమ పొట్టుతో ఫుడ్ కంటైనర్లు.. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం
గోధుమ పొట్టుతో తయారైన ఫుడ్ కంటైనర్లు, గిన్నెలు, కప్పులు, చాకులు, స్పూన్లు, ఫోర్క్‌లు వీటిని తినేయొచ్చుకూడా.

లక్షల జీతం వచ్చే ఉద్యోగం. అయినా ఎందుకో సంతోషంగా లేరు. ఇది కాదు నేను చేయాల్సిన ఉద్యోగం. ఇంకేదో చెయ్యాలి అనుకుంటూ పుట్టిన ఊరికే తిరిగి వచ్చేశారు కేరళలోని ఎర్నాకుళం నివాసి మారిషస్‌లోని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మాజీ సిఇఒ అయిన వినయ్‌కుమార్. స్థిరమైన జీవన విధానం వైపు తన లక్ష్యాన్ని ప్రారంభించడానికి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కేరళతో సహా దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ప్లాస్టిక్‌ను నిషేధించాయి. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా కొత్త ఉత్పత్తులను తీసుకురావాలనుకున్నారు. ఆ దిశగా ఆలోచన చేశారు.ఐఐటి కాన్పూర్, కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండిగ్రామ్ ల్యాబ్స్ సహకారంతో కొత్త ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు వినయ్‌కుమార్. దాదాపు రెండు సంవత్సరాల విస్తృతమైన పరిశోధనల ఫలితంగా, గోధుమ పొట్టుతో వివిధ రకాల ఉత్పత్తుల తయారీ గురించి అధ్యయనం చేశారు. 100 శాతం బయోడిగ్రేడబుల్ తినదగిన ఉత్పత్తులను తిన్నవంతపురంలోని సిఎస్ఐఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల సహకారంతో వినయ్‌కుమార్ అభివృద్ధి చేశారు.

"ప్లేట్లు, స్పూన్లు తినడం ఇష్టం లేకపోతే వాటిని పశువుల మేతకు, పౌల్ట్రీ ఫీడ్, ఫిష్ ఫీడ్, సేంద్రీయ ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. ఇవి ఎప్పటికీ వ్యర్థంగా పేరుకుపోదు. ఇది అన్ని జీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంది "అని వినయ్‌కుమార్ అన్నారు.

రైతులకు అదనపు ఆదాయం

వినయ్‌ కుమార్ రూపొందించిన ఈ ఉత్పత్తుల తయారీకి స్థానిక రైతులకు గోధుమ పొట్టు సరఫరాను సేకరించడం ద్వారా అదనపు ఆదాయ అవకాశాలు ఏర్పడతాయి. ప్లాస్టిక్‌ను విక్రయించని డీలర్లను గుర్తించిన తర్వాత దేశవ్యాప్తంగా అమ్మకానికి ఉత్పత్తుల పంపిణీ జరుగుతుందని వినయ్‌కుమార్ పేర్కొన్నారు.
2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని భారత ప్రభుత్వం ప్రతిపాదించడంతో, దేశానికి ఇలాంటి పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు అవసరమని వినయ్‌కుమార్ చెప్పారు. సింగిల్-యూజ్ మాస్క్‌లు, పిపిఇ కిట్‌లతో మహమ్మారి సమయంలో భారతదేశంలో ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అయినప్పటికీ, నెమ్మదిగా, అవగాహనతో ప్రజల వైఖరిలో మార్పు చోటు చేసుకుంటుందని వినయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story