Two-Wheeler Sales : పెట్రోల్ బండ్ల పని అయిపోయినట్టేనా?..రికార్డు స్థాయిలో ఈవీ అమ్మకాలు.

Two-Wheeler Sales : భారతదేశ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త శకం మొదలైంది. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవడానికి సామాన్యుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాడు. దీనికి నిదర్శనమే 2025 ఏడాదికి సంబంధించిన అమ్మకాల గణాంకాలు. గత ఏడాది దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. మొత్తం 12.8 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడై చరిత్ర సృష్టించాయి. ఈ రేసులో ఎవరూ ఊహించని విధంగా టీవీఎస్ మోటార్ కంపెనీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఓలాను దాటేసిన టీవీఎస్
గత మూడేళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తిరుగులేని రారాజుగా వెలిగిన ఓలా ఎలక్ట్రిక్‌కు 2025 ఏడాది పెద్ద షాక్ ఇచ్చింది. నాణ్యత లోపాలు, సర్వీస్ సమస్యల కారణంగా ఓలా విక్రయాలు ఏకంగా 51 శాతం పడిపోయాయి. దీంతో ఓలా నాలుగో స్థానానికి పడిపోగా, టీవీఎస్ మోటార్ కంపెనీ 2,98,967 స్కూటర్ల విక్రయాలతో అగ్రపీఠాన్ని దక్కించుకుంది. టీవీఎస్ ఐక్యూబ్ మోడల్ కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడమే దీనికి ప్రధాన కారణం. టీవీఎస్ తో పాటు బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ కంపెనీలు కూడా తమ కెరీర్ లోనే అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేశాయి.
రికార్డు స్థాయిలో ఈవీ మార్కెట్ వాటా
2025 సంవత్సరంలో భారత ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ మొత్తం 22.7 లక్షల యూనిట్ల రిటైల్ విక్రయాలను నమోదు చేసింది. ఇందులో ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్ల వాటానే సింహభాగం (56 శాతం) ఉండటం విశేషం. గతేడాదితో పోలిస్తే ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలు 11 శాతం పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో జీఎస్టీ నిబంధనలలో మార్పులు చేయడం, పెట్రోల్ బండ్లకు ఈవీలకు మధ్య ధర వ్యత్యాసం తగ్గడం కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడ్డాయి. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ప్రతి 100 ద్విచక్ర వాహనాల్లో కనీసం 6 వాహనాలు ఎలక్ట్రిక్ వే కావడం విశేషం.
ఎలక్ట్రిక్ బండ్లకే ఎందుకు మొగ్గు చూపుతున్నారు?
ప్రారంభ ధర పెట్రోల్ వాహనాల కంటే కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ, మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ కావడంతో జనం ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో తిరిగే మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద ఊరటనిస్తోంది. కేవలం వ్యక్తిగత అవసరాలకే కాకుండా, ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ సంస్థల డెలివరీ బాయ్స్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లనే ఎక్కువగా వాడుతున్నారు. రోజుకు ఎక్కువ కిలోమీటర్లు తిరిగే వారికి పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే ఈవీలు నెలకు వేల రూపాయలను ఆదా చేస్తున్నాయి.
మారుతున్న గ్రామీణ ముఖచిత్రం
కేవలం సిటీలకే పరిమితం కాకుండా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెరగడం, బ్యాటరీ టెక్నాలజీ మెరుగుపడటంతో కస్టమర్లలో ఉన్న భయాలు తొలగిపోతున్నాయి. కంపెనీలు కూడా కస్టమర్లను ఆకర్షించడానికి ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, సులభమైన ఫైనాన్స్ సౌకర్యాలను కల్పిస్తున్నాయి. 2026 నాటికి ఈ అమ్మకాలు మరింత పెరిగి, టూ-వీలర్ మార్కెట్లో ఈవీల వాటా 10 శాతానికి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

