Elon Musk: సోషల్ మీడియాతో ఎలన్ మస్క్ ఆటలు.. మరోసారి..

Elon Musk: సోషల్ మీడియాతో ఎలన్ మస్క్ ఆటలు.. మరోసారి..
Elon Musk: ట్వీట్లతో నెటిజన్లను గందరగోళంలో పడేసే టెస్లా, స్పేస్ ఎక్స్​సంస్థల CEO ఎలాన్‌ మస్క్ మరోసారి అదే పనిచేశారు.

Elon Musk: సోషల్ మీడియాలో తరచూ తన ట్వీట్లతో నెటిజన్లను గందరగోళంలో పడేసే టెస్లా, స్పేస్ ఎక్స్​సంస్థల CEO ఎలాన్‌ మస్క్ మరోసారి అదే పనిచేశారు. ప్రముఖ ఫుట్‌బాల్‌ క్లబ్‌ 'మాంచెస్టర్‌ యునైటెడ్‌'ను కొంటున్నట్లు సంచలన ట్వీట్‌ చేసి మరోసారి గందరగోళం సృష్టించారు. కొనుగోలుపై ప్రకటన చేశారే గానీ డీల్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ట్వీట్లతో సంచలనాలు సృష్టించిన చరిత్ర మస్క్‌కు ఉండటంతో.. వెంటనే దీనిని నమ్మలేని పరిస్థితి విశ్లేషకుల్లో నెలకొంది.

గందరగోళం నెలకొనడంతో న్యూస్ ఛానళ్లు 'మాంచెస్టర్‌ యునైటెడ్‌' ఓనర్ గ్లాజెర్స్‌ ఫ్యామిలీని, అటు మస్క్‌ను సంప్రదించాయి. కానీ రెండువైపుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కొన్ని గంటల తర్వాత మళ్లీ స్పందించిన మస్క్‌... ''అబ్బే అదేం లేదండీ.. ట్విట్టర్‌లో అత్యధిక కాలం ఉండే జోక్‌ ఇది. తాను ఎలాంటి జట్టును కొనడం లేదంటూ చెప్పుకొచ్చారు. దీంతో మళ్లీ వెర్రోల్లవడం జనాల వంతైంది.

గతేడాది నుంచి గ్లాజెర్స్‌ కుటుంబం మాంచెస్టర్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ జట్టును విక్రయించాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ, 4 బిలియన్‌ పౌండ్ల కంటే అధిక మొత్తంలో ఆఫర్‌ వస్తేనే విక్రయించడానికి సిద్ధంగా ఉంది. 'మాంచెస్టర్‌ యునైటెడ్‌' ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్‌ క్లబ్బుల్లో ఒకటి. ఇది ఏకంగా 20 సార్లు ఇంగ్లాండ్‌ను ఛాంపియన్‌గా నిలిపి రికార్డు సృష్టించింది. మూడు సార్లు యూరోపియన్‌ కప్‌ను గెలుచుకుంది. ఈ క్లబ్‌ మార్కెట్‌ విలువ ఏకంగా 2 బిలియన్‌ డాలర్లపైనే.

2005లో ఈ క్లబ్‌ను గ్లాజెర్స్‌ కుటుంబం 790 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇటీవల క్లబ్‌ ఆట తీరు కొంత నిరాశజనకంగా ఉండటంతో గ్లాజెర్స్‌కు వ్యతిరేకంగా ఫ్యాన్స్‌ ఆందోళనలు చేపడుతున్నారు. గతేడాది ఇవి తీవ్రం అయ్యాయి. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ ఎలాన్‌ మస్క్‌ను ట్విట్ట‌ర్​కు బదులు ఈ క్లబ్‌ను కొనాలని కోరారు. ఈ క్రమంలోనే మస్క్‌ ట్వీట్‌ చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.

ఇటువంటి అంశాలపై అభిమానుల్లో ఆసక్తి రేపి ఆ తర్వాత జోక్‌ చేశానంటూ చల్లగా జారుకున్న చరిత్ర మస్క్‌కు ఉంది. మరోవైపు ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్ల విలువైన ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందం నుంచి బయటపడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇప్పటికే ఆ ఒప్పందం మస్క్‌ను కోర్టుకు ఈడ్చింది.

Tags

Read MoreRead Less
Next Story