EMI: తగ్గనున్న హోమ్‌లోన్‌ ఈఎంఐ భారం

EMI: తగ్గనున్న హోమ్‌లోన్‌ ఈఎంఐ భారం
X
ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గనున్న వడ్డీ రేట్లు

గృహ రుణాలు తీసుకున్నవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నిర్ణయం ఊరటను తీసుకువచ్చింది. కీలక వడ్డీ రేటైన రెపోరేటును మరోసారి తగ్గిస్తూ ఆర్‌బీఐ 50 బేసిస్ పాయింట్ల తగ్గింపు ప్రకటించింది. ఈ సంవత్సరం ఇది మూడోసారి రెపోరేటులో కోత వేయడంతో, మొత్తం తగ్గింపులు ఒక శాతం దాటి పోయాయి. దీని ఫలితంగా హోమ్‌లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ భారం గణనీయంగా తగ్గనుంది.

ఎవరికి లాభం?

2019 అక్టోబర్ 1 తర్వాత జారీ అయిన అన్ని గృహ రుణాలు ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజా తగ్గింపుతో వాటిపై వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి. కొత్తగా రుణం తీసుకునేవారు తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందొచ్చు. పైగా, ఎక్కువ మొత్తంలో రుణం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు.

రుణగ్రహీతల ముందు రెండు ఎంపికలు:

ఈఎంఐ తగ్గించుకోవడం

కాలవ్యవధి తగ్గించుకోవడం

నిపుణుల సూచన ప్రకారం, రెండో ఎంపిక అయిన కాలవ్యవధి తగ్గించుకోవడం వల్ల దీర్ఘకాలంలో వడ్డీపై భారీగా ఆదా చేయవచ్చు.

ఉదాహరణ:

ఒకరు ఈ సంవత్సరం జనవరిలో రూ.50 లక్షల రుణాన్ని 20 ఏళ్లకు (240 నెలలు) తీసుకున్నారని అనుకుందాం. అప్పటి వడ్డీ రేటు 8.5% అయితే నెలవారీ ఈఎంఐ రూ.43,391గా ఉండేది. ఇప్పుడు ఆర్‌బీఐ నిర్ణయాల వల్ల వడ్డీ రేటు తగ్గి ఈఎంఐ రూ.40,280కి చేరింది. అంటే నెలకు దాదాపు రూ.3,100 ఆదా అవుతుంది. మొత్తం కాలంలో చూస్తే ఈ వడ్డీ తగ్గింపుతో రూ.7.12 లక్షల వరకూ ఆదా అవుతుంది.

కాలవ్యవధిని తగ్గిస్తే:

ఈఎంఐని మార్చకుండా కాలవ్యవధిని తగ్గించుకుంటే, 240 నెలల బదులుగా 206 నెలలకే రుణం పూర్తవుతుంది. దీని వల్ల మొత్తం వడ్డీ భారం దాదాపు రూ.14.78 లక్షలు తగ్గనుంది. RBI నిర్ణయం గృహ రుణ గ్రహీతలకు నిజంగా ఊరట కలిగించనుంది. సరైన ఆప్షన్‌ను ఎంచుకుని దీర్ఘకాల వడ్డీ భారం నుంచి ఉపశమనం పొందవచ్చు.

Tags

Next Story