పెట్రోల్, డీజిల్ ధరలకు చెక్ పడే అవకాశం

గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు చెక్ పడే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 10 నెలల నుంచి అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలపై భారం మోపక తప్పడం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ధరల పెరుగుదలో కొంచెం మార్పు రాబోతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.
పెట్రోలు, డీజిల్ ధరల భారాన్ని తగ్గించడం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. రిటెయిల్ ధరలో సుమారు 60 శాతం వరకు ఉన్న పన్నులను తగ్గించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. కేంద్రం ఆదాయం పెద్దగా దెబ్బతినకుండా, సామాన్యులకు అందుబాటులో పెట్రోలు, డీజిల్ ధరలను నిర్ణయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతోనూ, ఆయిల్ కంపెనీలతోనూ చర్చలు ప్రారంభమయ్యాయి. పెట్రోలు, డీజిల్ ధరలను నిలకడగా ఉంచేందుకు గల మార్గాల గురించి చర్చ జరుగుతోంది.
మరోవైపు మరికొద్ది రోజుల్లో చమురు ఎగుమతి చేసే దేశాల సంస్థ ఒపెక్, ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల సమావేశం జరగబోతోంది. చమురు ఉత్పత్తిపై ఆంక్షలను సడలించడంపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నారు. ఈ నిర్ణయం వెలువడితే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కచ్చితంగా ఉంటుంది. పది రోజుల్లో ధరల తగ్గుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండనుందని తెలుస్తోంది.
ALSO WATCH : కర్ణాటక మంత్రి రాసలీలల వీడియో కలకలం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com