girls schemes: అమ్మాయి ఆర్థిక భద్రతకు ఈ స్కీమ్స్ బెస్ట్

తల్లిదండ్రులు పసిబిడ్డ ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారో, పిల్లల ఆర్థిక భవిష్యత్తు కోసం అంతే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా పెరుగుతున్న విద్యా ఖర్చులు, వివాహం వంటి భవిష్యత్తు అవసరాల కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న వయసులోనే ఆడపిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం. సరైన సమయంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ లాభాలు పొందొచ్చు. జీవిత బీమా పాలసీలు, ఈక్విటీలు, సుకన్య సమృద్ధి యోజన వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీ అమ్మాయికి ఆర్థిక భరోసా కల్పించవచ్చు. వీటితో పాటు బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలను పొందవచ్చు. మీ పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి.
సుకన్య సమృద్ధి యోజన
మన జీవనశైలి, జీవన వ్యయం భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. భవిష్యత్తు పిల్లలదే తమ పిల్లల ఆర్థిక భద్రత గురించి తప్పక ఆలోచించాలి. ఆడబిడ్డల కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌లో సుకన్య సమృద్ధి యోజన ఒకటి. ఈ పథకంలో 15ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 10 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న అమ్మాయిల పేరుతో ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇందులో ఏడాదికి గరిష్టంగా 1.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకానికి ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. ఉదాహరణకు మీ చిన్నారి పేరుపై నెలకు రూ.5 వేలు పెట్టుబడి పెడుతూ వెళ్తే అమ్మాయికి 21 ఏళ్లు నిండాక సుమారు రూ.28 లక్షలు వస్తాయి.
జనరల్ ప్రోవిడెంట్ ఫండ్
ఇక చిన్నారుల కోసం అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌లో జనరల్ ప్రోవిడెంట్ ఫండ్ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెడితే 7.1శాతం వడ్డీ లభిస్తుంది. గరిష్టంగా ఏడాదికి 1.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. 15 ఏళ్లు కాల వ్యవధి ఉండే ఈ పథకాన్ని ఇష్టం ఉంటే మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. ఏడాదికి 1.5 లక్షలు పెట్టుబడి పెడితే 15 ఏళ్లకు మీ అమ్మాయికి రూ.40,68,209 చేతికి అందుతాయి. అదే మరో ఐదేళ్లు పొడిగిస్తే మొత్తం 20 ఏళ్లు దాటాక రూ.66,58,288 చేతికి వస్తాయి.
మ్యూచువల్ ఫండ్లు
పిల్లల ఉన్నత విద్యకు, ఇతర భవిష్యత్తు అవసరాల కోసం సంప్రదాయ పెట్టుబడి పథకాలతో పాటు మ్యూచువల్ ఫండ్లను కూడా ఎంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో సిప్ విధానాన్ని ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు, 20 ఏళ్ల వయసు వచ్చే నాటికి చదువు కోసం రూ.50 లక్షలు అవసరం పడుతుంది అనుకుందాం. దీని కోసం మీరు 12% సగటు రాబడి అంచనాతో, 15 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.10 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com