బంగారంపై పెట్టుబడి భేష్‌గా ఉంటుందా?

బంగారంపై పెట్టుబడి భేష్ గా ఉంటుందా? ఒకవేళ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంటే ఎంత మొత్తం బంగారానికి కేటాయించాలి? ఇప్పుడు గోల్డ్ కొంటే ఈ ఏడాది సిరులు కురిపిస్తుందా? అంటే.. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నాయి మార్కెట్ వర్గాలు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం తగ్గుదలతో 1738 డాలర్లకు క్షీణించింది.
ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతున్నాయి. అయితే అమెరికా డాలర్ బలహీనపడడం, ఉద్దీపన ప్యాకేజీలు, తక్కువ వడ్డీ రేట్ల వెరసి బంగారంపై పెట్టుబడికి సానుకూలంగా మారతాయని నిపుణులు అంటున్నారు. కాగా 2020లో మంచి ప్రాఫిట్స్ వచ్చాయి.
2020లో ప్రాఫిట్స్ :
2019తో పోలిస్తే 2020లో పుత్తడి బాగానే కలిసివచ్చింది. ఏడాది ప్రారంభంలో రూ.39వేల వద్ద ఉన్న పది గ్రాముల గోల్డ్ ప్రైస్ ఆగస్టులో రూ.56,200కు చేరింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు క్షీణించటం, స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి ఇందుకు ప్రధానంగా దోహదం చేశాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.51,600- 52,000 మధ్య ట్రేడవుతోంది.
2021లో..
భారత, చైనాల్లో గోల్డ్ కొనుగోళ్లు తగ్గాయి. అయితే త్వరలో గోల్డ్ కొనుగోళ్లు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.60,000 స్థాయిని తాకుతుందని HDFC సంస్థ అంచనా వేస్తోంది. అయితే బంగారం ధర.. ఒక్కోసారి హఠాత్తుగా పెరిగిపోతుంటాయి. భారీగా లాభాలొస్తున్నాయన్న ఆశతో మొత్తం పెట్టుబడులను పసిడిలోకే మళ్లించడం శ్రేయస్కరం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఒకవేళ బంగారం ధరలు భారీగా పతనమైతే పెట్టుబడులు మొత్తం ఒక్కసారి హరించుకుపోయే ప్రమాదం ఉంది.
అందుకే మార్కెట్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. ఏ సమయంలో బంగారంలోకి పెట్టుబడులు మళ్లిస్తే మంచి రాబడి వస్తుందో అంచనా వేయాలి. అయితే, ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఓ రాయి వేసి చూద్దాం అన్నట్లుగా కాకుండా మీ అవసరాలు, లక్ష్యాలననుసరించి పెట్టుబడులు పెట్టాలా?లేదా? అన్నదానిపై ముందుకు వెళ్లండి.
అలాగే బంగారాన్ని భౌతికంగా కొనడానికి బదులు పసిడి బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ వంటి ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి సారించాలి. వీటిలో మదుపు చేయడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com