Google 2 Step Verification: జీమెయిల్ ఓపెన్ చేయాలంటే ఇక ఇది తప్పనిసరి!

Google 2 Step Verification: మిగతా టెక్నికల్ యాప్స్, సోషల్ మీడియా, ఓటీటీలతో పోలిస్తే గూగుల్‌లో సేఫ్టీ ఎక్కువ. గూగుల్ వల్ల ఎవరి ప్రైవసీకి అయినా భంగం కలగడం కానీ, ఎవరి సమాచారం అయినా లీక్ అవ్వడం కానీ జరగదు. అందుకే మిగతా వాటితో పోలిస్తే యూజర్లు కూడా గూగుల్‌ను ఎక్కువగా నమ్ముతారు. అయితే యూజర్ల నమ్మకాన్ని మరింత పెంచుకోవడానికి గూగుల్ ఒక కొత్త అప్డేట్‌ను తీసుకురానుంది. ఇది ఈ నెల 9 నుండి అమల్లోకి రానుంది.
సైబర్ నేరగాళ్లు ఈ మధ్య మరీ ఎక్కువవుతున్నారు. టెక్నాలజీలోని విషయాలు అన్నీ తెలుసుకుని వాటిని నేరాలు చేయడానికి ఉపయోగిస్తున్న ఈ సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడం పోలీసులకు కూడా కష్టమవుతోంది. అందుకే ఈ విషయంలో ప్రజలే అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు చాలాసార్లు తెలిపారు. దీనికి తోడుగా టెక్ వరల్డ్ కూడా ప్రజల ప్రైవసీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈ క్రమంలో గూగుల్ కూడా కొత్త అప్డేట్‌ను తీసుకురానుంది. గూగుల్ అనేది ఒక స్మార్ట్‌ఫోన్ ఇన్ఫర్మేషన్ మొత్తం తనలో దాచుకునే టూల్ లాంటిది. దీనిని పాస్‌వర్డ్ లేకుండా ఓపెన్ చేయడం కష్టం. కానీ ఒకవేళ గూగుల్ ఎకౌంట్ పాస్‌వర్డ్ పొరపాటున ఎవరికైనా తెలిస్తే.. ఇంక అంతే సంగతి. అందుకే గూగుల్ ఇప్పుడు 2 స్టెప్ వెరిఫికేషన్‌ను అమల్లోకి తీసుకురానుంది.
ప్రస్తుతం అందరు ఉపయోగిస్తున్న గూగుల్ వర్షన్‌లో కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంది. కానీ దీనిని ఉపయోగించాలా వద్దా అన్న ఆప్షన్‌ను యూజర్లకే వదిలేసింది గూగుల్ యాజమాన్యం. దీనిని మన సౌకర్యానికి తగినట్టు ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. కానీ నవంబర్ 9 నుండి ఆ ఆప్షన్ ఉండదు. కచ్చితంగా గూగుల్ ఎకౌంట్‌ను ఓపెన్ చేయాలంటే 2 స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com