GST: నేటి నుంచే కొత్త జీఎస్టీ.. సామాన్యులకు పండుగే

సెప్టెంబర్ 22 అర్థరాత్రి నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్‌లు అమల్లోకి వచ్చాయి. ఈసారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేద, మధ్యతరగతి వర్గాలకు విశేష ఊరటను కలిగించేలా ఉంది. నెలవారీ ఖర్చులతో సతమతమవుతున్న సామాన్యులకు ఈ మార్పులు నిజంగా గిఫ్ట్లాంటివే. ప్రధాని మోదీ దీపావళి సందర్భంగా పెద్ద బహుమతి ఇస్తామని ప్రకటించగా.. అంతకు ముందుగానే దసరా పండగకు తగ్గిన ధరలతో వస్తువులు అందుబాటులోకి రానున్నాయి. ఈసారి ప్రభుత్వం జీఎస్టీ శ్లాబ్‌లను సరళీకరించి కేవలం 5% , 18% రెండు కేటగిరీల్లో ఉంచింది. దాదాపు 200 పైగా నిత్యావసర, వినియోగ వస్తువులపై పన్ను తగ్గించి ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయం వ్యాపార రంగంలోనూ కొత్త ఉత్సాహాన్ని రగిలిస్తోంది.
నిత్యావసరాలపై ఊరట
షాంపూలు, సబ్బులు, టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్, రేజర్లు, బేబీ డైపర్లు వంటి రోజువారీ ఉపయోగించే వస్తువులు ఇప్పుడు చౌకగా లభించనున్నాయి. అదేవిధంగా టీవీలు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా ధరలు తగ్గనున్నాయి. ఇప్పటికే అనేక తయారీ సంస్థలు కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఎలక్ట్రానిక్స్ & ఆటోమొబైల్ రంగం28% శ్లాబ్‌లో ఉన్న అనేక గృహోపకరణాలు ఇప్పుడు 18%కి వస్తున్నాయి. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, డిష్వాషర్లు, పెద్ద స్క్రీన్ టీవీలు, సిమెంట్ వంటి ఉత్పత్తులు ఇందులో ఉన్నాయి. ఆటోమొబైల్ రంగంలో కూడా చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు తక్కువ పన్నుతో మార్కెట్లోకి రానున్నాయి. లగ్జరీ కార్లపై మాత్రం అధిక పన్ను కొనసాగుతుంది.
భీమా & మెడికల్ సెక్టార్‌లో పెద్ద ఊరట
ఆరోగ్య బీమా, జీవిత బీమా, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు వంటి వాటిపై పన్ను పూర్తిగా రద్దు చేయడం మధ్యతరగతి వర్గానికి పెద్ద ప్లస్‌గా మారనుంది. అదే విధంగా యాంటీ-క్యాన్సర్ మందులు, థర్మామీటర్లు, గ్లూకోమీటర్లు వంటి కీలక మెడికల్ ఉత్పత్తులపై కూడా జీఎస్టీ లేకపోవడం వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది.
రైతులు, విద్యార్థులకు బూస్ట్
రైతుల కోసం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 12% నుండి 5%కి తగ్గించారు. విద్యార్థుల కోసం నోట్‌బుక్స్, ఎరేసర్లు, పెన్సిల్స్, క్రేయాన్స్ వంటి విద్యా సామగ్రిపై కూడా ఇదే తగ్గింపు వర్తించనుంది. దీని వల్ల రైతులు, విద్యార్థులు ఆర్థికంగా ఊపిరి పీల్చే అవకాశం ఉంది. అధిక పన్నుతో విలాస వస్తువులుఇక సిగరెట్లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలా, చక్కెర కలిగిన కార్బొనేటెడ్ డ్రింక్స్, పెద్ద కార్లు, హెలికాప్టర్లు, యాట్స్ వంటి విలాస వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించనున్నారు. మొత్తంగా, కొత్త జీఎస్టీ 2.0 ప్రజలకు నేరుగా చేరే ఊరట ప్యాకేజీగా కనిపిస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలు దసరా పండగను మరింత హ్యాపీగా జరుపుకునేలా చేయడమే కాకుండా.. వ్యాపార రంగానికి కూడా కొత్త ఉత్సాహాన్ని తెస్తోంది. కొత్త జీఎస్టీ రేట్ల అమలుతో వినియోగదారులు ఇప్పుడు తక్కువ ఖర్చులో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ కొనుగోలు చేయగలరు. మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భద్రత పెరగడం ద్వారా దసరా పండగ వేడుకలకు మరింత ఉత్సాహం వస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com