రానున్న ఐదు నెలల్లో పెరిగిన ఇంటి విక్రయాలు..

ఇంటి నుంచి పని చేయడం ఇక చాలించండి.. ఆఫీస్‌కి వచ్చేయండి అంటూ ఐటీ కంపెనీలు ఇప్పటికే ఇంటిమేషన్ ఇచ్చేశాయి ఉద్యోగులకు. లాక్డౌన్, కోవిడ్ పేరుతో పట్నం వదిలి పల్లె బాట పట్టిన వారంతా మళ్లీ తిరిగి పట్నం రాక తప్పని పరిస్థితి. ఈ సమయంలో అద్దెలు బోలెడు చెల్లించే బదులు సొంత ఇల్లు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు కొందరు సాప్ట్‌వేర్ ఉద్యోగులు.
రియల్టీ రంగం కూడా తమ వ్యాపారం పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆశాభావంతో ఉన్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో), ఫిక్కి, నైట్‌ఫ్రాంక్ సంయుక్తంగా చేపట్టిన సెంటిమెంట్ ఇండెక్స్ తాజా సర్వేలో డెవలపర్లు, కొనుగోలుదారులు ఇదే విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ అనంతరం సొంతింటి అవసరం పెరగడమే మార్కెట్లు త్వరగా కోలుకోవడానికి కారణమని బిల్డర్లు అంటున్నారు. రానున్న ఐదు నెలల్లో విక్రయాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో పలు కంపెనీలు కొత్తగా కార్యాలయాలు తెరిచేందుకు ముందుకొస్తున్నాయి. పెద్ద ఎత్తున డేటా కేంద్రాలు రాబోతున్నాయి. ఇందుకోసం అవసరమైన భవనాలను లీజుకు తీసుకునే అవకాశం ఉంది. ఇక ధరల విషయానికి వస్తే ఇళ్ల ధరలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న ధరలే కొనసాగే అవకాశం ఉందని 47 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.
మరికొంత మంది ధరలు పెరుగుతాయని అంటున్నారు. ఏది ఏమైనా ఇల్లు కొనే ఆలోచన ఉంటే తొందరపడడం మంచిది. ముందు ముందు ధరలు పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశం ఉండదు. మీ బడ్జెట్‌లో మీకు నచ్చిన ఇంటిని నచ్చిన ఏరియాలో కొనడానికి ముందడుగేయమంటున్నారు స్థిరాస్థి నిపుణులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com