HYD: గ్లోబల్ క్యాపిటల్‌గా హైదరాబాద్

ఒకప్పుడు ఐటీ హబ్ అంటే బెంగళూరు అని వినిపించేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. మన హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో సరికొత్త స్థానాన్ని సంపాదించుకుంటోంది. పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేసేందుకు మన దేశం వైపే మొగ్గు చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీసీసీలలో దాదాపు సగానికిపైగా ఇప్పుడు భారత్‌లోనే ఉన్నాయి. దేశంలో జీసీసీల లిస్టులో చూస్తే బెంగళూరు అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, హైదరాబాద్ నగరం రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత మూడో స్థానంలో ఉన్న చెన్నై కూడా కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్ నగరం ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఆకర్షణలో అగ్రగామిగా కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన రెండు ప్రముఖ సంస్థలు తమ జీసీసీలు ఏర్పాటు చేయబోతున్నాయి. అందులో ఒకటి నేషన్‌వైడ్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ అనే సంస్థ కాగా, మరొకటి రిటెయిల్ సంస్థ కాస్ట్కో. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలకు అవసరమైన ఐటీ సేవలు అందించేందుకే ఈ సంస్థలు తమ జీసీసీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. దీని కోసం తమకు అనువైన భవనాలను గుర్తించి, తగిన ఏర్పాట్లు చేసుకోవడంలో ఈ సంస్థలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
నేషన్‌వైడ్ మ్యూచువల్ ఇన్సూరెన్స్
దాదాపు 90 ఏళ్లుగా అమెరికాలో బీమా, ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థ నేషన్‌వైడ్ మ్యూచ్‌వల్ ఇన్సూరెన్స్. ఇది ప్రపంచంలోని అతిపెద్ద బీమా సంస్థల్లో ఒకటి. 2026 ప్రారంభంలో ఈ సంస్థ హైదరాబాద్‌లో తన జీసీసీని ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఏర్పాటుతో 500 నుంచి 1000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉంది. ఇప్పటివరకు అమెరికాలోనిన కొలంబస్, డెస్ మోయిన్స్, స్కాట్స్‌డేల్‌లలో ఈ సంస్థ కార్యాలయాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాలకు చెందిన మాస్ మ్యూచువల్, వాన్‌గార్డ్, వెల్స్‌ఫార్గో.. తదితర సంస్థలు ఇప్పటికే తమ జీసీసీలను నిర్వహిస్తుండటం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com