HYD: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కొత్త చిరునామా..హైదరాబాద్

భారతదేశంలో బహుళజాతి సంస్థల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC) ఏర్పాటు ఊపందుకుంటోంది. ఈ తరహా కేంద్రాల ఆకర్షణలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ కీలక స్థానాన్ని దక్కించుకుంటోంది. వివిధ దేశాలకు చెందిన బహుళజాతి కంపెనీలు (MNCs) ఇటీవల కాలంలో మనదేశంలో అధికంగా జీసీసీలను ఏర్పాటు చేస్తుండగా, వీటిలో ఎక్కువ భాగాన్ని హైదరాబాద్ నగరం ఆకర్షిస్తోంది. ముఖ్యంగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) మరియు ఫార్మా రంగాలకు చెందిన జీసీసీలు ఇక్కడ విస్తృతంగా నెలకొంటున్నాయి. హైదరాబాద్‌లో ఐటీతో పాటు ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల ప్రాబల్యం, అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఉండటం వంటి అంశాలు ఈ కంపెనీలు కొత్త జీసీసీల కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ పెరుగుతున్న ఆకర్షణ స్థానికంగా స్థిరాస్తి రంగానికి, ముఖ్యంగా వాణిజ్య స్థలానికి గిరాకీని పెంచుతుందని అంచనా.
హైదరాబాద్, బెంగళూరు, పుణెలే కీలకం
కన్సల్టింగ్ సేవల సంస్థ అయిన సావిల్స్ ఇండియా నివేదిక ప్రకారం, హైదరాబాద్ నగరంలో వివిధ సంస్థలు తమ జీసీసీల కోసం 2020-24 మధ్యకాలంలో 1.86 కోట్ల చదరపు అడుగుల భవన నిర్మాణ స్థలాన్ని తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా జీసీసీలు వినియోగిస్తున్న మొత్తం స్థలంలో ఇది 17% కావడం విశేషం. ఈ విషయంలో బెంగళూరు తర్వాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. నిజానికి, మనదేశంలో జీసీసీలు అధికంగా బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాల్లో ఏర్పాటవుతున్నాయి. దేశవ్యాప్తంగా జీసీసీలు అద్దెకు తీసుకుంటున్న మొత్తం భవన నిర్మాణ స్థలంలో ఈ మూడు నగరాల వాటా 86 శాతంగా ఉంది.
భవిష్యత్తు అంచనాలు: 2030 నాటికి మరింత వృద్ధి
ప్రస్తుతం భారతదేశంలో 1,800 జీసీసీలు ఉండగా, వీటిలో 19 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2030 నాటికి జీసీసీల సంఖ్య 2,200కు, ఉద్యోగుల సంఖ్య 28 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ఐటీ, బీఎఫ్ఎస్ఐ, ఇంజినీరింగ్-మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, రిటైల్, కన్జూమర్ సర్వీసెస్ విభాగాల్లో కొత్త క్లస్టర్లు ఏర్పడటం ఈ విస్తరణకు వీలు కల్పిస్తుంది. సావిల్స్ ఇండియా విశ్లేషణ ప్రకారం, 2025-30 మధ్యకాలంలో అదనంగా 3 కోట్ల చదరపు అడుగుల నిర్మాణ స్థలాన్ని భారత్‌లో జీసీసీలు అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. ఆటోమోటివ్, లైఫ్‌సైన్సెస్, సెమీకండక్టర్ జీసీసీలు అధికంగా ఏర్పాటు కావొచ్చని అంచనా.
భారత్‌ను ఎంచుకోవడానికి కారణాలు
భారతదేశంలో అధికంగా నిపుణుల లభ్యత, తక్కువ నిర్వహణ వ్యయాలు, సానుకూల ప్రభుత్వ విధానాలు, పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలకు పెద్దపీట వేయడం వంటి అంశాలు జీసీసీలను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తున్నాయి. అంతేగాక, దేశంలో పర్యావరణ అనుకూల సదుపాయాలు, హైబ్రిడ్ పని విధానాలు, వ్యూహాత్మక నగరాల ఎంపిక జీసీసీల విస్తరణను ప్రభావితం చేస్తున్నాయని సావిల్స్ ఇండియా ఎండీ అర్వింద్ నందన్ వివరించారు. హైదరాబాద్‌లో త్వరలో మూడు అగ్రశ్రేణి బహుళజాతి సంస్థల జీసీసీలు ఏర్పాటు కానున్నాయి. యూఎస్ ఆధారిత రిటైల్ దిగ్గజం కాస్ట్‌కో, యూఎస్ ఆధారిత ఆర్థిక సేవల సంస్థ వెస్ట్రన్ యూనియన్, యూకేకు చెందిన సరకు రవాణా సేవల సంస్థ స్టోల్ట్-నీల్సన్ ఇక్కడ తమ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

