HYDERABAD:హైదరాబాద్‌లో అద్దె ఆఫీస్‌లకు ఫుల్ డిమాండ్

దేశీయ ఐటీ కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరంలో ఆఫీస్ అద్దె ధరలు భారీగా పెరిగాయి. గత మూడేళ్లలో చదరపు అడుగుకు అద్దె ధరలు రూ.58 నుండి రూ.72కి చేరుకొని 24 శాతం వృద్ధి నమోదైంది. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ అనరాక్ తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. కోవిడ్ అనంతరం ఉద్యోగులు మళ్లీ ఆఫీసులకు హాజరవడం, హైబ్రిడ్ మోడల్‌కు కంపెనీలు మొగ్గుచూపడం, అంతర్జాతీయ సంస్థలు దేశీయంగా విస్తరణకు ఆసక్తి చూపడం వంటి అంశాల కారణంగా ఈ వృద్ధి నమోదైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గ్రేడ్-ఏ కార్యాలయాలు, అంటే నాణ్యత, లొకేషన్, సదుపాయాల పరంగా ప్రీమియం స్థాయిలో ఉన్న ఆఫీసులకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
టాప్‌లో ముంబై .. ఇతర నగరాల్లోనూ పెరుగుదల
అధ్యయనం ప్రకారం, అత్యధిక అద్దె ధరల పెరుగుదల ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో (ఎంఎంఆర్) కనిపించింది. అక్కడ చదరపు అడుగుకు అద్దె రూ.131 నుండి రూ.168కి పెరిగి 28 శాతం వృద్ధి నమోదైంది. ఢిల్లీ ఎన్‌సీఆర్ లో రూ.92 నుంచి రూ.110కి (20%), బెంగళూరులో రూ.82 నుంచి రూ.95కి (16%), పుణెలో రూ.72 నుంచి రూ.80కి (11%), చెన్నైలో రూ.66 నుంచి రూ.72కి (9.1%) అద్దె ధరలు పెరిగాయి.
అమెరికన్ కంపెనీల నుంచే అధిక లీజింగ్
దేశవ్యాప్తంగా గ్రేడ్-ఏ కార్యాలయాలకు డిమాండ్‌లో అమెరికా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అనరాక్ కమర్షియల్ లీజింగ్ ఎండీ పీయూష్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, తాజా లీజింగ్ ఒప్పందాల్లో 45 శాతం వాటా అమెరికా కంపెనీల నుంచే వచ్చింది. ముంబైలో బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్షూరెన్స్) విభాగంలో నమోదైన లీజింగ్‌లో 48 శాతం యూఎస్ కంపెనీలదే.
హైదరాబాదుకు ప్రత్యేక స్థానం
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో కొత్తగా నిర్మిస్తున్న టవర్లకు ఇప్పటికే ముందస్తుగా లీజింగ్ ఒప్పందాలు జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, రాజకీయ స్థిరత్వం వల్ల విదేశీ కంపెనీలు హైదరాబాద్‌ను పరిశీలిస్తున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగానికి పుంజుకొనే సూచనలు
ఐటీ, ఫైనాన్స్, స్టార్ట్‌అప్, హెల్త్‌కేర్ రంగాల విస్తరణతోపాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో దేశీయ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోందని నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ విభాగంలో అద్దె ధరలు, లీజింగ్ డిమాండ్ 2025 చివరికి మరింతగా పెరిగే అవకాశముందని అంచనా. ఆర్థికవృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, కొనుగోలుదారుల అభిరుచిలో మార్పుల కారణంగా హైదరాబాద్‌లో గృహ విక్రయాలు పెరిగాయి. గతేడాది నగరంలో 12 శాతం వృద్ధి రేటుతో 36,974 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. నగరంలో ఆఫీస్ స్పేస్ ధర చ.అ.కు సగటున రూ.70గా ఉంది. ఏడాది కాలంలో ధరలు 7 శాతం మేర పెరిగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com