20 Sep 2021 9:25 AM GMT

Home
 / 
బిజినెస్ / బడ్జెట్లో స్థలం...

బడ్జెట్లో స్థలం కొనాలంటే.. శంకర్‌పల్లి దాటాల్సిందే..

సిటీలో ఇల్లు కొన్నా కొనకపోయినా కనీసం 150, 200 గజాల్లో స్థలం ఏదైనా కొందామన్నా ధరలెక్కడా అందుబాటులో లేవు..

బడ్జెట్లో స్థలం కొనాలంటే.. శంకర్‌పల్లి దాటాల్సిందే..
X

సిటీలో ఇల్లు కొన్నా కొనకపోయినా కనీసం 150, 200 గజాల్లో స్థలం ఏదైనా కొందామన్నా ధరలెక్కడా అందుబాటులో లేవు.. సామాన్యుడి సంగతి సరేసరి.. మధ్యతరగతి వాసికి కూడా అందనంత ఎత్తులో ఉన్నాయి ఆకాశాన్నంటుతున్న రియల్ ఎస్టేట్ ధరలు. కాగా, నగరం నలుమూలలా ఐటీ కారిడార్ విస్తరించడంతో పాటు, రవాణా సౌకర్యం అనుకూలంగా ఉండడంతో భవిష్యత్ నివాస, పెట్టుబడులకు శంకర్ పల్లి అనువుగా ఉందని భావిస్తున్నారు పెట్టుబడిదారులు. కోవిడ్‌కు ముందు ఇక్కడ వ్యాపారం బాగానే సాగింది. మధ్యలో మార్కెట్ కాస్త మందగించినా మళ్లీ ఇప్పుడు కోలుకుంటోంది. అభివృధ్ది వేగంగా జరగడమే ఇందుకు కారణమని రియల్టర్ వర్గాలు చెబుతున్నాయి.

గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాకు చేరువలో ఉండడంతో మోఖిల్లా, కొండకల్, నాగులపల్లి, కొల్లూరు, ముత్తంగి, భానూరు, వెలిమల, నందిగామ, శంకర్‌పల్లి వరకు పెద్ద ఎత్తున లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ సంస్థలు విక్రయించాయి. ఈ ప్రాంతాల్లో చదరపుగజం రూ.20 వేలు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్ల నిర్మాణంతో పాటు, విల్లా ప్రాజెక్టులు కూడా ఊపందుకున్నాయి. ఇక్కడ అపార్ట్‌మెంటైతే రూ.40లక్షలు, విల్లా అయితే కోటి రూపాయలు చెబుతున్నారు. ముందు ముందు ఈ ఏరియా మరింత అభివృద్ధి చెందడంతో పాటు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు రియల్ వ్యాపారులు.

బడ్జెట్లో స్థలాలు కొనాలంటే మాత్రం శంకరపల్లి దాటి వికారాబాద్ మార్గంలో ఉన్న మహాలింగాపురం, ధోబిపేట, లక్ష్మారెడ్డిగూడ ప్రాంతంలో చదరపు గజం రూ.12 వేల నుంచి 15 వేల వరకు చెబుతున్నారు. చేవెళ్ల మార్గంలో రామంతాపూర్, పర్వే-సంకేపల్లి మార్గం, కంది, సంగారెడ్డి మార్గం వరకు లే అవుట్ల విస్తరణ జరిగింది. ఇక్కడ ఫాం ల్యాండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి కొంత ముందుకు వెళితే గజం రూ.10వేలకు దొరుకుతున్నాయి. కోవిడ్‌కు ముందైతే గజం రూ.6 వేలకే విక్రయించినట్లు స్థానికులతో పాటు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెబుతున్నారు.

శంకరపల్లికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోకా పేట ఉండడం కలిసొచ్చే అంశం. స్థానికంగా రైల్వే స్టేషన్, కొండకల్‌లో రైల్వే కోచ్, భానూరులో బీడీఎల్ వంటి పరిశ్రమలు ఉండడం, భవిష్యత్తులో కొండకల్‌లో ఐటీ పార్కు ప్రతిపాదన, పలువురు ప్రముఖుల నివాసాలు ఉండడం వంటివి శంకర్ పల్లి రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అనుకూలంగా ఉన్నాయి.

Next Story