Top 25 IT Companies: ఐటీలో భారత్‌కు మరో రికార్డ్.. టాప్‌ 25 ఐటీ కంపెనీల్లో..

Top 25 IT Companies: ఐటీలో భారత్‌కు మరో రికార్డ్.. టాప్‌ 25 ఐటీ కంపెనీల్లో..
Top 25 IT Companies: ప్రపంచవ్యాప్తంగా IT సేవా రంగంలో రెండవ అత్యంత విలువైన కంపెనీగా TCS అవతరించింది.

Top 25 IT Companies: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా IT సేవా రంగంలో రెండవ అత్యంత విలువైన కంపెనీగా TCS అవతరించింది. వార్తా సంస్థ పిటిఐ విడుదల చేసిన బ్రాండ్ ఫైనాన్స్ నివేదికలో ఈ విషయం తెలిపింది. ఈ నివేదికలో.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ఐటీ బ్రాండ్ల జాబితాలో తొలి మూడు స్థానాల్లో రెండు భారత్‌కు చెందినవే కావడం విశేషం.

పటిష్ఠమైన ఐటీ సేవల సంస్థగా యాక్సెంచర్‌ తన తొలిస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.మార్కెటింగ్‌ కోసం పెట్టుబడులు, వినియోగదారుల సంతృప్తి, సిబ్బంది సంతృప్తి, కార్పొరేట్‌ వర్గాల్లో కీర్తి, భవిష్యత్తు రెవెన్యూ అంచనాలు.. బ్రాండ్‌ పటిష్ఠత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కంపెనీల బ్రాండ్‌ విలువను గణిస్తారు.

ఇందులో టాప్‌-25 బ్రాండ్ల జాబితాలో భారత్‌కు చెందిన విప్రో, హెచ్‌సీఎల్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌టీఐ కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ కంపెనీల టాప్‌-10 జాబితాలోనే ఉన్నాయి.ఇక TCS సంస్థ ఈ సంవత్సరంలో 12 శాతం, 2020 నుండి 24 శాతం వృద్ధిని సాధించింది. దీంతో దీని బ్రాండ్ విలువ 16.8 బిలియన్లకు చేరుకుంది.

2021 సంవత్సరంలో TCS ఆదాయాలలో భారీ పెరుగుదల కనిపించింది. మొత్తం 25 బిలియన్ల డాలర్ల రికార్డు ఆదాయాన్ని ఆ సంస్థ సాధించింది. TCS ఇంత పెద్ద మొత్తంలో ఆర్జించడం ఇదే తొలిసారి. ఐటీ పరిశ్రమ లాభాల మార్జిన్‌ 25 శాతంగా ఉంది. బ్రాండ్ విలువ పరంగా టీసీఎస్ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకోవడం కూడా ఇదే తొలిసారి.మొత్తంగా చూసినట్లైతే 2020 నుంచి భారతీయ బ్రాండ్ల సగటు వృద్ధి 51 శాతం పెరిగితే.. US బ్రాండ్ల వృద్ది సగటున 7 శాతం తగ్గింది.

కరోనా మహమ్మారి వల అనేక రంగాలు ప్రభావితం అయినప్పటికీ ఐటి రంగం దూసుకెళ్తున్నాయి. మార్కెట్ కి అనుగుణంగా క్లౌడ్ సేవలు, టెక్నాలజీ కన్సల్టింగ్, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సు వంటి సేవలు అందిస్తుండటం ద్వారా అంతర్జాతీయ, దేశీయ కంపెనీలు తమ బ్రాండ్ విలువను పెంచుకుంటూ పోతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story