INDIA: భారత ఆర్థిక వ్యవస్థకు తిప్పలు తప్పవా.?

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర దశలోకి ప్రవేశించాయి. ఇరాన్‌లోని కీలక లక్ష్యాలపై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు పశ్చిమాసియాలో భద్రతా ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి. ఈ పరిణామాలు కేవలం ప్రాంతీయ ఘర్షణలకే పరిమితం కావు. ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు, ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థపై కూడా వీటి ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హార్ముజ్ జలసంధి చుట్టూనే..
ప్రస్తుతం అందరి దృష్టి నిలిచింది హార్ముజ్ జలసంధిపైనే. ఇరాన్‌ను ఒమన్, యూఏఈల నుంచి వేరు చేసే ఈ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గం. ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారానే సాగుతోంది. ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడం ప్రపంచ ఇంధన భద్రతకు పెద్ద ముప్పుగా మారింది. భారత్ పరిస్థితి మరింత సున్నితంగా ఉంది. దేశం వినియోగించే ముడి చమురులో సుమారు 85 శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. అందులో 50 శాతానికి పైగా హార్ముజ్ జలసంధి గుండా వస్తోంది. రోజుకు సుమారు 26 లక్షల బ్యారెళ్ల ముడి చమురును భారత్ ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి దేశాల నుంచి ఈ మార్గంలో దిగుమతి చేసుకుంటోంది. అదేవిధంగా రోజుకు సుమారు 74,000 బ్యారెళ్ల శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను కూడా ఇదే మార్గం ద్వారా ఎగుమతి చేస్తోంది. ఇప్పటికే అమెరికా బలగాల మోహరింపుతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దాదాపు 10 శాతం మేర పెరిగాయి. ఇరాన్ రోజుకు ఉత్పత్తి చేసే 33 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరాలో అంతరాయం కలిగితే, బ్యారెల్ ధరలు 76–81 డాలర్ల వరకు చేరవచ్చని సూచిస్తున్నాయి.
రూపాయి పతనం, దిగుమతుల భారం
భారత్ చమురు కొనుగోళ్లకు అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేస్తుంది. ధరలు పెరిగితే మరింత ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల డాలర్‌కు డిమాండ్ పెరిగి రూపాయి విలువపై ఒత్తిడి పడుతుంది. రూపాయి పతనం జరిగితే ఇతర దిగుమతుల ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రభావం పడుతుంది. ఫలితంగా సరకు రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఎర్ర సముద్రంలో భద్రతా సమస్యలు తలెత్తితే నౌకలు ఆఫ్రికా చుట్టూ ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా సమయం 15–20 రోజులు పెరగవచ్చు. ఖర్చులు 40–50 శాతం అధికమయ్యే అవకాశం ఉంది. ఈ భారమంతా వినియోగదారుడిపై పడుతుంది.
ఎగుమతులపై ప్రభావం
హార్ముజ్ మార్గంలో అంతరాయం ఏర్పడితే భారత్ నుంచి ఇరాన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యే బాస్మతీ బియ్యం, ఫార్మాస్యూటికల్స్, టీ, సుగంధ ద్రవ్యాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. గగనతలాలు పాక్షికంగా మూసివేయడం వల్ల విమానయాన సంస్థలు మార్గమార్పులు చేయాల్సి వస్తోంది. దీని వల్ల ఇంధన వినియోగం పెరిగి విమాన టిక్కెట్ల ధరలు కూడా అధికమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ టారిఫ్ అనిశ్చితుల మధ్య ఒత్తిడిలో ఉన్న స్టాక్ మార్కెట్లు తాజా పరిణామాలతో మరింత కుదేలయ్యే అవకాశం ఉంది. యుద్ధ భయాలు కొనసాగినంత కాలం మార్కెట్లలో అస్థిరత కొనసాగవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
