INDIGO: కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం.. కారకులు వీళ్లేనా!

ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం కొనసాగుతుంది. ఆరో రోజు ఆదివారం దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో 650 విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా గత ఆరు రోజుల్లో దాదాపు 3వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి. దాంతో దేశంలో విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. లక్షలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నది. మరో వైపు ఇండిగోపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంక్షోభంపై 24గంటల్లో స్పందించాలని పేర్కొంటూ డీజీసీఏ ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, సీవోవో, అకౌంటబుల్ మేనేజర్ పోర్కెరాస్లకు షో కాజ్ నోటీసులు జారీ చేసింది. కార్యాచరణ ప్రణాళిక, వనరుల నిర్వహణలో గణనీయమైన వైఫల్యం వల్లనే ఈ సంక్షోభం తలెత్తిందని డీజీసీఏ నోటీసుల్లో పేర్కొంది.
ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభానికి ప్రధాన కారణం కొత్త ఎఫ్డీటీఎల్ రూల్స్‌ను అమలు చేసేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడమేనని.. దాంతో విమానయాన సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ నోటీసుల్లో ప్రశ్నించింది. ఇండిగో సర్వీస్‌కు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం సీనియర్ మంత్రిత్వశాఖ అధికారులు పీటర్ ఎల్బర్స్‌తో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. మరో వైపు ఏవియేషన్ మినిస్ట్రీ ప్రయాణికులకు పెండింగ్‌లో ఉన్న అన్ని రీఫండ్స్‌ను ఆదివారం రాత్రి 8 గంటల్లోగా క్లియర్ చేయాలని ఆదేశించింది. విమానాల రద్దు నేపథ్యంలో ప్రభావితమైన ప్రయాణికుల నుంచి రీషెడ్యూలింగ్‌కు ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దని స్పష్టం చేసింది. ఫిర్యాదులను పరిష్కరించేందుక, రియల్ టైమ్ అప్డేట్స్ అందించేందుకు ప్రయాణికులకు స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పెద్ద ఎత్తున విమానాలు రద్దు చేయడంతో పాటు ఆలస్యం కావడంతో తీవ్రమైన కార్యాచరణ గందరగోళాన్ని ఎదురుకుంటుంది. ఈ అంతరాయానికి కారణం విమాన సిబ్బంది తీవ్ర కొరత, షెడ్యూల్‌ను నిర్వహించే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ క్రమంలో ఇండిగో పైలట్ల పేరుతో రాసిన ఓ బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సీఈవో పీటర్ ఎల్బర్స్ సహా పలువురు ఉన్నతాధికారులు ఇండిగోను పతనం అంచుకు నెట్టారని ఆ లేఖలో ఆరోపించారు. ఇండిగో సంక్షోభం రాత్రికి రాత్రే తలెత్తలేదని.. అది సంవత్సరాలుగా జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. 2006లో ఇండిగో ప్రారంభం నుంచే మొదలైంది లేఖలో ప్రస్తావించారు. అనుభవం, అర్హతలను విస్మరించి, నైపుణ్యం, కార్యాచరణ అవగాహన లేని వ్యక్తులకు కీలక పదవులను అప్పగించడంతో ఎయిర్‌లైన్ పతనం ప్రారంభమైందని ఆరోపించారు. పైలట్లు, సిబ్బంది అలసట, భద్రత, నిబంధనలను విస్మరించారని లేఖలో పేర్కొన్నారు. అలసట, పని ఒత్తిడి డ్యూటీలను వ్యతిరేకించిన పైలట్లను కార్యాలయానికి పిలిచి మందలించడం, బెదిరింపులకు దిగడం, అవమానించినట్లు లేఖలో ప్రస్తావించారు. అదనంగా జీతం చెల్లించకుండా డ్యూటీలు, షిఫ్ట్‌లు, పెరిగిన పనిభారం మొపారని.. సిబ్బంది ఉద్యోగాల్లో సంతోషంగా ఉండాలని కానీ.. కాలక్రమేణా విమానయాన సంస్థలో విషపూరితమైన పని సంస్కృతి అభివృద్ధి చెందిందని లేఖలో ఆరోపించారు.
ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తిని సంవత్సరాలుగా విస్మరించారని.. ఆ ప్రభావం ప్రస్తుతం కార్యాచరణ సంక్షోభం రూపంలో వ్యక్తమవుతుందన్నారు. లేఖలో ఎనిమిది మంది ఉన్నతాధికారులు ప్రస్తుత సంక్షోభానికి బాధ్యులుగా పేర్కొన్నారు. లేఖలో మొదట పేరు సీఈవో పీటర్ ఎల్బర్స్ పేరు ఉంది. ఈ సంక్షోభ సమయంలో ఆయన సెలవులో ఉన్నాడని.. స్వస్థలం నెదర్లాండ్స్‌కు వెళ్లినట్లుగా ఆరోపించారు. ఈ సంక్షోభానికి జాసన్ హార్టర్, అదితి కుమారి, తపస్ డే, రాహుల్ పాటిల్, సీవోవో పోర్కెరాస్, అసిమ్ మిత్రా (ఫ్లైట్ ఆపరేషన్స్ ఎస్వీపీ), అక్షయ్ మోహన్ ఉన్నారు. ఈ ఎగ్జిక్యూటివ్‌ల నిర్ణయాల కారణంగా గతవారం రోజులుగా ఇండిగో కార్యాచరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లుగా లేఖ ఆరోపించింది. పైలట్ల పేరుతో రాసిన లేఖ వైరల్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

