INSURANCE: అన్‌క్లెయిమ్డ్ ఇన్సూరెన్స్.. మీ డబ్బు ఎక్కడుందో తెలుసా..?

పాలసీదారులు పాలసీ వివరాలు మరిచిపోవడం, నామినీలకు పాలసీ గురించి తెలియకపోవడం లేదా కీలక డాక్యుమెంట్లు పోగొట్టుకోవడం వంటి అనేక కారణాల వల్ల దేశంలోని వివిధ బీమా కంపెనీల వద్ద వేల కోట్ల రూపాయలు అన్‌క్లెయిమ్డ్ (ఎవరూ క్లెయిమ్ చేయని) సొమ్ముగా పేరుకుపోయి ఉంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, ఈ మొత్తం దాదాపుగా రూ.25,000 కోట్లకు పైనే ఉండడం ఆందోళన కలిగించే విషయం. సరైన అవగాహన, మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు తమ హక్కు అయిన ఈ మొత్తాన్ని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో, అన్‌క్లెయిమ్డ్ మొత్తాలు అంటే ఏమిటి, వాటిని ఎలా కనుగొనాలి, మరియు ఎలా పొందాలనే వివరాలు తెలుసుకుందాం. ఒక బీమా కంపెనీ తన వినియోగదారుడికి చెల్లించాల్సిన మొత్తం (ఉదాహరణకు, మెచ్యూరిటీ సొమ్ము, డెత్ క్లెయిమ్, అధికంగా చెల్లించిన ప్రీమియం మొదలైనవి) ఏదైనా అనివార్య కారణాల వల్ల 12 నెలల కంటే ఎక్కువ కాలం పాటు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంటే, ఆ మొత్తాన్ని అన్‌క్లెయిమ్డ్ మొత్తంగా పరిగణిస్తారు. ఈ అన్‌క్లెయిమ్డ్ మొత్తాలు ప్రధానంగా ఈ సందర్భాల్లో ఏర్పడతాయి:
డెత్ క్లెయిమ్: పాలసీదారుడు మరణించినా, నామినీకి పాలసీ గురించి తెలియక క్లెయిమ్ చేయకపోవడం.
మెచ్యూరిటీ క్లెయిమ్: పాలసీ కాలపరిమితి ముగిసినా, పాలసీదారుడు క్లెయిమ్ చేయకపోవడం.
సర్వైవల్/హెల్త్ బెన్‌ఫిట్ క్లెయిమ్‌లు: పాలసీ నిబంధనల ప్రకారం లభించే మధ్యంతర లేదా ఆరోగ్య ప్రయోజన క్లెయిమ్‌లు.
ప్రీమియం అధికంగా చెల్లించడం: తప్పుగా లేదా అదనంగా కట్టిన ప్రీమియం సొమ్ము.
మీ అన్‌క్లెయిమ్డ్ సొమ్మును తెలుసుకోవడం ఎలా?
మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్‌క్లెయిమ్డ్ మొత్తం ఏదైనా ఉందో లేదో తెలుసుకోవడానికి రెండు ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి: ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అన్‌క్లెయిమ్డ్ మొత్తాలకు సంబంధించి ఒక ప్రత్యేక విభాగాన్ని కేటాయిస్తుంది. ఆ విభాగంలోకి వెళ్లి, పాలసీదారుడి పేరు, పుట్టిన తేదీ, పాన్ నంబర్, లేదా పాలసీ నంబర్ వంటి వివరాలను కనీసం రెండు ఫీల్డుల్లో నమోదు చేయడం ద్వారా తనిఖీ చేయవచ్చు.
ఐఆర్‌డీఏఐ బీమా భరోసా పోర్టల్:
బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ భీమా భరోసా పేరుతో ఒక సమగ్ర పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్‌లో అన్ని జీవిత, ఆరోగ్య బీమా కంపెనీల వెబ్సైట్ లింకులు ఒకే చోట లభిస్తాయి. మీరు తనిఖీ చేయాలనుకుంటున్న కంపెనీ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా నేరుగా ఆ కంపెనీ వెబ్‌సైట్‌లోని అన్‌క్లెయిమ్డ్ క్లెయిమ్ పేజీకి చేరుకుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

