INVESTMENTS: కుబేరుల పెట్టుబడుల్లో కొత్త ధోరణి

ధనికుల పెట్టుబడుల దృష్టిలో ఇప్పుడు సంపదను కాపాడుకోవడంతో పాటు, దీన్ని మరింతగా పెంచుకోవడం కీలకమైన లక్ష్యంగా మారింది. సంప్రదాయ పెట్టుబడి సాధనాలైన భూములు, బంగారం, షేర్లతోపాటు... ప్రైవేట్ ఈక్విటీ (PE), వెంచర్ క్యాపిటల్ (VC), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (AIF) వంటి కొత్త మార్గాల వైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారు. ‘రిస్క్ తీసేందుకు సిద్దంగా ఉండే ధైర్యం, ఆర్ధిక సామర్థ్యం ఉన్నవారికి ఇది మంచి అవకాశమవుతుంది’ అంటున్నారు నిపుణులు. EY ఇండియా & జూలియస్ బేర్ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ‘ఇండియన్ ఫ్యామిలీ ఆఫీస్ ప్లేబుక్’ ఈ అంశంపై అనేక విషయాలు తెలిపింది.
వేగంగా పెరుగుతున్న ఫ్యామిలీ ఆఫీసులు
2018లో 45గా ఉన్న ఫ్యామిలీ ఆఫీసుల సంఖ్య ఇప్పుడు 300 దాటిపోయింది. వీటిలో నాలుగవంతు సంపద పరిరక్షణపై దృష్టి సారిస్తుండగా, మిగిలినవన్నీ సంపద వృద్ధికి ప్రయోగాత్మక మార్గాలను అన్వేషిస్తున్నాయి. PE, VCతో పాటు విదేశీ స్థిరాస్తుల్లోనూ ఈ ఫ్యామిలీలు పెట్టుబడులు పెడుతున్నాయి. గుజరాత్ గిఫ్ట్ సిటీ వంటి ప్రాంతాల్లో పన్ను రాయితీలు, గ్లోబల్ పెట్టుబడులకు ఉన్న ప్రవేశద్వారాలు దీన్ని మరింత వేగవంతం చేస్తున్నాయి. విభిన్న పెట్టుబడులు పెడుతూనే.. అధిక సామర్థ్యం, వారసత్వ ప్రణాళిక, సంస్థాగత నిర్మాణానికి ఫ్యామిలీ ఆఫీసులు ప్రాధాన్యమిస్తున్నాయి. సంపన్న కుటుంబాల్లో 59% వీలునామాలు సిద్ధం చేసుకోవడం ఆసక్తికర అంశం. దాదాపు 19% సంపన్న కుటుంబాలు ఎల్ఎల్పీ/ ట్రస్ట్‌లు పెట్టుకున్నాయి. . ఇవన్నీ పరిశీలిస్తే.. సంస్థాగత నిర్మాణం వైపు సంపన్నులు మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతోంది.
2030 నాటికి ₹100 లక్షల కోట్లు!
PE, AIFల్లో పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో 2030 నాటికి ఈ విభాగం ₹100 లక్షల కోట్లను చేరుకుంటుందని అంచనా. PMS, REIT, INVIT వంటి కొత్త పెట్టుబడి సాధనాలపై ఆసక్తి పెరుగుతోంది. సెబీ ఇటీవల AIFలపై ఉన్న కొన్ని కఠిన నిబంధనలను సడలించడంతో పెట్టుబడిదారులకు ఇది మరింత ఆకర్షణీయంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

