ధర తగ్గింది.. బంగారం కొనొచ్చా.. ఆర్థిక నిపుణులు ఏం సలహా ఇస్తున్నారు

అనుకోని అవసరాలు హఠాత్తుగా వచ్చిపడుతుంటాయి. అప్పడు వస్తు రూపంలో కొనుగోలు చేసిన బంగారు నగలు అక్కరకొస్తాయి. ఒకరిమీద ఆధారపడకుండా చేస్తాయి. పసిడి మీద పెట్టుబడి ఎప్పుడూ తప్పుకాదు. కరోనా సంక్షోభం నుంచి కోలుకునేందుకు వ్యాక్సిన్ ఊరటనిచ్చే అంశం. సంక్షోభ సమయంలో ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్ల వంటి వాటి విలువ భారీగా పడిపోయింది. పసిడి ధరలు మాత్రం అనూహ్యంగా కిందకు దిగివచ్చాయి. దీంతో ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చా అన్న ప్రశ్న మదుపర్లను ఆలోచించేలా చేస్తోంది.
అసలు బంగారం ధరలు ఎందుకు తగ్గాయి అనే విషయం చాలా మందికి తెలియదు.. అయితే బంగారం ధరల్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. ప్రపంచ రాజకీయాల నుంచి స్థానిక అంశాల వరకు పసిడి ధరల్ని ప్రభావితం చేస్తాయి. అమెరికా డాలర్ బలపడడం, బాండ్ల ప్రతి ఫలాలు ఎగబాకడం బంగారం ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం.
బంగారంపై పెట్టుబడి పెట్టడం కరెక్టేనా అని ఆలోచించే వారు.. ముందు మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే దానిపై ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది. బంగారంపై పెట్టుబడి అనేది మదుపర్ల వ్యక్తిగత అవసరాలు, భవిష్యత్ లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
ఒక్కోసారి మార్కెట్లోని పలు అంశాలకు బంగారం ధరలకు సంబంధం ఉండదు. ఒక్కోసారి హఠాత్తుగా పెరిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ల పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. ఏ సమయంలో బంగానంపై పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుంది అనేది అంచనావేయాలి. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ మీ అవసరాలు, లక్ష్యాలనను సరించి పెట్టుబడులు పెట్టాలా లేదా అనే దానిపై ఒక అవగాహనకు రావాలి.
అలాగే బంగారాన్ని వస్తు రూపంలో కొనే బదులు బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. వీటిల్లో మదుపు చేయడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది.
ఉన్న సంపద అంతా పసిడిపైకి మళ్లించడం శ్రేయస్కరం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఒకవేళ బంగారం ధరలు భారీగా పతనమైతే పెట్టుబడి పెట్టిన మొత్తం ఒక్కసారే హరించుకుపోయే ప్రమాదం ఉంది. అందువలన వ్యక్తిగత అవసరాలు, భవిష్యత్ లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం వీటన్నిటిబట్టి 5-15 శాతం వరకు బంగారంపై పెట్టుబడులు కేటాయించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com