ITC: ITC నుంచి వేరు కానున్న హోటళ్ల వ్యాపారం, నష్టాల్లో షేర్లు

ITC: ITC నుంచి వేరు కానున్న హోటళ్ల వ్యాపారం, నష్టాల్లో షేర్లు
కొత్త సంస్థలో ITC సంస్థ 40 శాతం షేర్‌ని అట్టిపెట్టుకోనుంది. మిగిలిన 60 శాతాన్ని ముదుపర్లకు వారి వాటా ఆధారంగా అందించనున్నారు.

ITC: ప్రముఖ FMCG సంస్థ ITC షేర్లు స్టాక్ మార్కెట్‌లో మంగళవారం 3 శాతానికి పైగా పడిపోయాయి. ITC తన గ్రూపులోని ITC హోటళ్లని వేరు చేస్తామని నిర్ణయించడమే దీనికి కారణం. కంపెనీ నిన్న ఈ విషయాన్ని ప్రకటించడంతో ముదుపర్లలో ఆందోళన మొదలైంది. ITC హోటల్స్‌ సంస్థ కింద ఫార్చూన్, వెల్‌కమ్, ITC మౌర్య, ITC గ్రాండ్ భారత్, ITC మరాఠా, రాయల్ బెంగాల్ వంటి హోటల్స్‌తో దేశంలోని వివిధ ప్రాంతాల్లో విలాసవంతమైన ఆతిథ్యాన్ని అందిస్తోంది. ఇప్పుడు ఈ సంస్థ మాతృసంస్థ నుంచి వేరై సొంత సంస్థగానే మార్కెట్‌లో రానుంది. కొత్త సంస్థలో ITC సంస్థ 40 శాతం షేర్‌ని అట్టిపెట్టుకోనుంది. మిగిలిన 60 శాతాన్ని ముదుపర్లకు వారి వాటా ఆధారంగా అందించనున్నారు.


అయితే ఈ డీమెర్జర్‌కి షేర్ హోల్డర్స్, రుణదాతల నుంచి ఆమోదం రావాల్సి ఉంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కమిటీల నుంచి తుది అనుమతుల కోసం ఆగస్టు 14న సాయంత్రం సమావేశం జరగనుంది. వీరి అనుమతుల అనంతరం షేర్ హోల్డర్స్, రుణదాతలు, ఇన్వెస్టర్ల ఆమోదం కూడా తీసుకోవాల్సి ఉంది.

ITC హోటల్స్ బిజినెస్ 2004 సంవత్సరంలో మాతృసంస్థలో విలీనమైంది. గత దశాబ్ధ కాలం నుంచి 11 శాతం CAGR నమోదు చేస్తూ వస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరానికి హోటల్స్ విభాగం 2,579 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. ఇది మొత్తం ITC ఆదాయంలో 4 శాతానికి సమానం. ఎబిటా(EBITDA) 830 కోట్లుగా నమోదైంది.

Tags

Read MoreRead Less
Next Story