Jukooru Anusha: ఐటీ జాబ్ వదిలేసి తేనెటీగల పెంపకం.. లక్షల్లో సంపాదన..

Jukooru Anusha: ఐటీ జాబ్ వదిలేసి తేనెటీగల పెంపకం.. లక్షల్లో సంపాదన..
Jukooru Anusha: అమెరికాలో ఉద్యోగం.. ఆరంకెల జీతం.. అయినా ఏదో అసంతృప్తి.

Jukooru Anusha : పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయాలని అందరిలానే కలలుకంది. అనుకున్నట్టుగానే అమెరికాలో ఉద్యోగం.. ఆరంకెల జీతం.. అయినా ఏదో అసంతృప్తి. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పుట్టి పెరిగిన ఊరికే పయనమయ్యింది. తేనెటీగల పెంపకాన్ని చేపట్టి స్వచ్ఛమైన తేనె తయారు చేసి విక్రయిస్తూ లక్షలు ఆర్జిస్తోంది.

మిర్యాలగూడకు చెందిన లింగయ్య, జానకమ్మ దంపతుల కుమార్తె అనూష. ఇంటర్ తర్వాత చెన్నైలో బీఫార్మసీ చేసింది. ఆస్ట్రేలియాలోని సెంట్రల్ క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసింది.

క్యాంపస్ సెలక్షన్స్‌లో అమెరికా ఐటీ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం. అయినా ఆనందం లేదు.. భర్తతో కలిసి భారత్‌కు వచ్చేసింది. రైతు కుటుంబం నుంచి వచ్చిన అనూష వ్యవసాయ రంగంలో ప్రయోగాలు చేయాలనుకుంది. స్వచ్ఛమైన తేనె తయారు చేసి మార్కెట్ చేయాలనుకుంది. అందుకోసం తేనెటీగల పెంపకం వైపు దృష్టిసారించింది.

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఎన్‌ఐఆర్‌డీలో పదిరోజుల పాటు తేనెటీగల పెంపకం, స్వచ్ఛమైన తేనె తయారీపై శిక్షణ తీసుకుంది. రూ.50వేల పెట్టుబడితో అనూష వ్యాపారం ప్రారంభించారు. మొదటిసారి ఐదు బాక్సులతో తేనెటీగల పెంపకం చేపట్టారు.

వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలతో తేనెటీగల పెంపకంపై మంచి అవగాహన తెచ్చుకుంది. ఏడాదిలోనే తన పెట్టుబడిని రూ.20 లక్షలకు పెంచి 250కి పైగా తేనెటీగల బాక్సులు ఏర్పాటు చేసింది. నిజామాబాద్‌లో పొద్దుతిరుగుడు పంట సీజన్‌లో, వికారాబాద్‌లో వామపంట సీజన్‌లో, ఆర్మూర్‌లో నువ్వుల పంట సీజన్‌లో తేనెటీగల బాక్సులను అక్కడికి తీసుకెళ్లి ఉంచి తేనెను సేకరించేది.

ఇలా సేకరించగా వచ్చిన తేనెను హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లోని ప్యాకింగ్ పాయింట్‌కు తరలించి 'బీఫ్రెష్' పేరుతో ప్యాకింగ్ చేసి బెంగళూరు, ముంబై, దిల్లీ, హైదరాబాద్లోని దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొండలు గుట్టలు ఉండే ప్రాంతంలో సులువుగా తేనెటీగల పెంపకం చేపట్టవచ్చని అనూష వివరించింది.

తన వ్యాపారం ద్వారా కొందరికి ఉపాధి కూడా కల్పిస్తున్నానని ఆనందంగా చెబుతోంది. తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తానని చెబుతోంది అనూష.

Tags

Read MoreRead Less
Next Story