NO INTERNET: త్వరలో ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ

టీవీ ప్రసారాలు చూడొచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా లైవ్ టీవీని చూసే మొబైల్స్‌ను తీసుకొచ్చేందుకు రెండు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. గతంలో నోకియా పేరుతో ఫోన్లు తయారుచేసే హెచ్‌ఎండీ సంస్థ.. ఫ్రీస్ట్రీమ్ టెక్నాలజీస్, ఇతరులతో కలిసి డైరెక్ట్-టు-మొబైల్(డీ2ఎం) ఫోన్లు మార్కెట్‌లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. లావా ఇంటర్నేషనల్ సైతం డీ2ఎం ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్-2025 ఈవెంట్ వేళ ఈ రెండు కంపెనీలు ప్రకటన చేశాయి.
తేజస్ నెట్‌వర్క్స్‌తో భాగస్వామ్యం
డైరెక్ట్-టు-మొబైల్ సేవలను అందించడానికి హెచ్‌ఎండీ సంస్థ ఫ్రీస్ట్రీమ్ టెక్నాలజీస్, తేజస్ నెట్‌వర్క్స్, సింక్లెయిర్‌తో కలిసి మొబైల్ ఫోన్‌ను రూపొందించింది. దీన్ని వేవ్స్ 2025 ఈవెంట్‌లో ప్రదర్శించనుంది. మే 1 నుంచి నాలుగు రోజుల పాటు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా ఈ ఈవెంట్ జరగనుంది. లావా కూడా ఇన్‌హౌస్ ఆర్‌అండ్‌డీ టీమ్‌తో పాటు తేజస్ నెట్‌వర్క్స్‌తో కలిపి ఫీచర్ ఫోన్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. మీడియాటెక్ ఎంటీ6261 ప్రాసెసర్, శాంఖ్య రూపొందించిన ఎస్‌ఎల్3000 చిప్‌తో ఈ మొబైల్ పనిచేస్తుంది. టీవీ ప్రసారాల కోసం యూహెచ్‌ఎఫ్ యాంటెన్నా ఉంటుంది. 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫీచర్‌లో అమర్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com