LIC IPO : స్టాక్ మార్కెట్ లో లిస్టు అయిన ఎల్‌ఐసీ..!

LIC IPO : ఇన్వెస్టర్లు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన ఎల్‌ఐసీ లిస్టింగ్ చివరకు తుస్సుమంది. ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్ళుచల్లుతూ ఇవాళ డిస్కౌంట్‌తో స్టాక్ మార్కెట్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇష్యూ ధర 949 రూపాయలు కాగా ఇవాళ 8శాతం పైగా నష్టంతో 872 రూపాయల వద్ద ఇవాళ ట్రేడింగ్‌ను ప్రారంభించింది ఎల్‌ఐసీ. గ్రేమార్కెట్ అంచనాలకు అనుగుణంగా ప్రస్తుతం ఎల్‌ఐసీ కదలాడుతోంది. దీంతో లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎదురుచూసిన రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీహోల్డర్లు చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్‌ఐసీ... పబ్లిక్ ఇష్యూ ద్వారా 20 వేల 557 కోట్ల నిధులను సమీకరించింది. ఈ ఇష్యూకు దాదాపు మూడు రెట్ల స్పందన లభించింది. ఈ ఇష్యూకు చాలా మంది మార్కెట్ ఎక్స్‌పర్ట్స్... లాంగ్‌టర్మ్‌కోసం రికమండ్ చేశారు. ఇన్సూరెన్స్ రంగంలోని ఇతర పోటీ సంస్థలతో పోలిస్తే ఎల్‌ఐసీ భవిష్యత్తులో చాలా మెరుగైన రిటర్న్స్‌ను అందించే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతుండటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా కనిపించింది. దీంతో ఇన్వెస్టర్ల ఆశలను అడియాసలు చేస్తూ ప్రస్తుతం ఎల్‌ఐసీ నష్టాల్లో కొనసాగుతోంది.
లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎల్‌ఐసీ ఇష్యూకు అప్లయ్ చేసుకున్న ఇన్వెస్టర్ల ఆశలు అడియాసలయ్యాయి. ఇంట్రాడేలో షేర్ 918.95 రూపాయల గరిష్టానికి చేరినప్పటికీ... ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో మళ్ళీ 900 దిగువకు షేర్ పడిపోయింది. ఇంట్రాడేలో 860 రూపాయల కనిష్ట స్థాయిని టచ్ చేసిన ఎల్‌ఐసీ ... ప్రస్తుతం 7శాతం నష్టంతో 883 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఈలో 3 కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.55 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com