మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర

మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర
పేదోళ్లకి మళ్లీ కట్టెల పొయ్యి, బొగ్గుల కుంపటే దిక్కయ్యేలా ఉంది.

పేదోళ్లకి మళ్లీ కట్టెల పొయ్యి, బొగ్గుల కుంపటే దిక్కయ్యేలా ఉంది. గ్యాస్‌ ధరలను ఎడాపెడా పెంచేస్తున్న పెట్రోలియం సంస్థలు.. మరోసారి 25 రూపాయల అదనపు భారాన్ని సామాన్యుడి నెత్తిన మోపాయి. కేవలం ఈ ఒక్క నెలలోనే గ్యాస్‌ సిలిండర్ ధర వంద రూపాయలు పెరిగింది. ఫిబ్రవరిలో ఇలా రేటు పెంచడం ఇది మూడోసారి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి సిలిండర్ బుక్‌ చేస్తే 25 రూపాయలు అదనంగా చెల్లించాలి. హైదరాబాద్‌లో నిన్నటి వరకు సిలిండర్ ధర 821 రూపాయలు ఉండేది. నేటి నుంచి 846 రూపాయలు చెల్లించాలి. దీంతో పేద, మధ్యతరగతి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సెంచరీ దాటించాలనే ఉద్దేశంతో పెట్రోల్‌ రేట్లను, వెయ్యి రూపాయలకు చేర్చాలని గ్యాస్‌ సిలిండర్ ధరను పోటీపడి మరీ పెంచుతున్నట్టు కనిపిస్తోంది. ఈ రేట్ల పెంపు ఇలాగే కొనసాగితే జస్ట్ నెల రెండు నెలల్లోనే టార్గెట్ రీచ్‌ అయినా ఆశ్చర్యం లేదంటున్నాడు సామాన్యుడు. వెయ్యి రూపాయల జీతం పెరగడానికి ఏడాది రెండేళ్లు పడుతుంటే.. గ్యాస్‌ ధరలను మాత్రం నెలకు వంద రూపాయల చొప్పున పెంచుతూ పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ.. మరోవైపు గ్యాస్‌ సిలిండర్ ధరలను పెంచుతూ.. రెండు చేతులతో సామాన్యుడి జేజును ఖాళీ చేస్తున్నాయి పెట్రోలియం కంపెనీలు. ఇప్పటికే, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల నీళ్ల నుంచి పాల వరకు, కూరగాయల నుంచి నిత్యావసర సరుకుల వరకు అన్నింటి ధరలూ పెరిగిపోయాయి. ఓవైపు వంట నూనెల ధరలు సలసలకాగుతుంటే.. వంటింటి గ్యాస్‌ కూడా అదే రేంజ్‌లో మండిపడుతోంది. మొత్తంగా పెట్రో, గ్యాస్‌ మంటలతో సామాన్యుడిని నిలువుగా కాల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సామాన్యుడు నోరు తెరవడం లేదనో ఏమో.. రెండు వారాలుగా అడ్డూ అదుపులేకుండా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఉండిపోయాయే తప్ప.. ధరలను నియంత్రించడం గాని, తగ్గించడం గాని చేయడం లేదు. దీంతో లారీ యజమానులే ఆందోళనకు దిగారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రేపు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. రేపటి భారత్‌ బంద్‌కు కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ పిలుపునివ్వడంతో దానికి కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతోపాటు అఖిల భారత వాహనదారుల సంక్షేమ సంఘం కూడా సంపూర్ణ మద్దతు పలికింది. బంద్‌కు అన్ని రాష్ట్ర స్థాయి వాహనదారుల సంఘాలు మద్దతివ్వనున్నాయి. డీజిల్‌ ధరలు తగ్గించాలని.. దేశవ్యాప్తంగా ధరలు ఒకేలా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. భారత్‌ బంద్‌కు దేశంలోని దాదాపు 40 వేల కార్మిక సంఘాలు, దాదాపు 8 కోట్ల మంది వ్యాపారులు మద్దతివ్వనున్నారు.

కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ మరో అడుగు ముందుకేసింది. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన చక్కా జామ్‌ తరహాలోనే జాతీయ రహదారులను దిగ్భంధిస్తామని హెచ్చరించింది. రేపు రహదారుల దిగ్బంధం చేస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే డీజిల్ ధరల పెంపుపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. డీజిల్‌ ధరలు తగ్గించాలని.. జీఎస్టీని సమీక్షించి సిఫారసులు చేయడానికి ఓ కమిటీ ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story