LPG: సామాన్యులకు షాక్.. గ్యాస్ సిలిండర్ ధర మరో రూ. 100 పెరిగే ఛాన్స్

LPG:పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగలనుంది. వంట గ్యాస్ ధరను మరోసారి పెంచేందుకు చమురు కంపెనీలు కసరత్తులు చేస్తున్నాయి . దీంతో దీపావళికి ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 60 శాతం పెరగడంతో.. దేశీయంగా గ్యాస్ సిలిండర్ ధర మరో 100 రూపాయలు వరకు పెరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ధరలు పెరగాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం చమురు సంస్థలు వేచి చూస్తున్నాయి. ప్రభుత్వం అనుమతి రాగానే గ్యాస్ సిలిండర్ ధర పెరగనుంది.
పెట్రోలు, డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయడంతో అవి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ మారుతుంటాయి. గ్యాస్ ధరలు నియంత్రణ పరిధిలోనే ఉన్నా, రాయితీని దాదాపుగా ఎత్తివేసింది. కొనుగోలు ధరతో సమానంగా ఉండేలా అమ్మకం ధరను దఫదఫాలుగా పెంచుతూ వస్తోంది. సబ్సిడీని భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే సిలిండర్ ధరలు పెంచుతామని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పెంపు మరీ ఎక్కువగా ఉండబోదని, మధ్యస్థంగా ఉంటుందని తెలిపాయి..
ఒకవేళ ప్రభుత్వం ఒప్పుకుంటే ఈ ఏడాది వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది ఐదోసారి అవుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు సార్లు వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. వచ్చేవారం గ్యాస్ ధరల పెంపుపై స్పష్టత వచ్చే అవకాశముంది. కాగా హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర 952 రూపాయలు, వైజాగ్లో 908, ఢిల్లీలో 899.50, ముంబైలో 899.50 రూపాయలుగా ధరలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com