TECH: టెకీలను మరోసారి టెన్షన్ పెడుతున్న కంపెనీలు

TECH: టెకీలను మరోసారి టెన్షన్ పెడుతున్న కంపెనీలు
X
కరోనాతో మొదలైన లేఆఫ్​లు.. బలవుతున్న దిగ్గజ కంపెనీల ఉద్యోగులు

కరోనా మహమ్మారి తర్వాత వ్యయాలు తగ్గించుకోవడంతో పాటు పునర్నిర్మాణంలో భాగంగా ఏఐ వంటి సాంకేతికతలకు ప్రాధాన్యం ఇవ్వడానికి వీలుగా ఆయా ప్రముఖ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది ప్రారంభం నుంచే గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, టిక్‌టాక్‌ వంటి ప్రముఖ టెక్ దిగ్గజాలు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. 2025లో ఇప్పటివరకు 234 లేఆఫ్‌ల ద్వారా 45,656 మంది ఉద్యోగులను తగ్గించుకున్నాయని లేఆఫ్ ట్రాకింగ్ ఫ్లాట్‌ఫామ్ ట్రూఅప్ డేటా వెల్లడించింది. అంటే సగటున ఒక రోజుకు 439 మంది ఉద్యోగులను తొలగించారు. 2024లో 1,115 లేఆఫ్‌ల ద్వారా 2,38,461 మంది ఉద్యోగులను తగ్గించుకోగా.. రోజుకు సగటున 653 మందిని ఇంటికి పంపించేశారు.

గూగుల్ మూడోసారి లేఆఫ్‌లు

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది మూడోసారి లేఆఫ్‌లను ప్రకటించింది. ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్‌ బ్రౌజర్‌ను నిర్వహిస్తున్న తన ప్లాట్‌ఫామ్స్‌ అండ్‌ డివైజెస్‌ యూనిట్‌లో వందలాది మందిని తొలగించింది. 2024లో ఆండ్రాయిడ్, పిక్సెల్‌ విభాగాలను విలీనం చేసిన తర్వాత ఈ ఏడాది ప్రారంభంలోనే అమెరికాలోని ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించింది. ఫిబ్రవరిలో గూగుల్‌ క్లౌడ్‌ విభాగం నుంచి ఉద్యోగులను తొలగించింది.

మే నెలలో మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్‌లు!

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాగత నిర్మాణంలో భాగంగా మే నెలలో లేఆఫ్‌లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి మధ్య స్థాయి మేనేజ్‌మెంట్‌ ఉద్యోగులను తగ్గించడంపై ఫోకస్ సారించనుంది. ప్రాజెక్ట్‌ బృందాల్లో నాన్‌-టెక్నికల్‌ సిబ్బంది కంటే ఇంజినీర్లు ఎక్కువగా ఉండేలా చూసుకోనుంది. ఛార్లీ బెల్‌ నేతృత్వం వహిస్తున్న మైక్రోసాఫ్ట్‌ సెక్యూరిటీ విభాగం ఇంజినీర్‌-టు-ప్రాజెక్ట్‌ మేనేజర్‌ నిష్పత్తిని 5.5:1 నుంచి 10:1కి పెంచుకోవాలనే లక్ష్యంతో ఉంది.

మెటా, టిక్‌టాక్‌లో ఉద్యోగాల కోత

ఫిబ్రవరిలో ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా సుమారు 3,600 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు ఉన్న ఉద్యోగుల్లో వీరు 5 శాతానికి సమానం. ఇక ఏప్రిల్ నెలలో టిక్‌టాక్‌లో సుమారు 300 మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించే అవకాశం ఉంది. అయితే, దీనిపై కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

Tags

Next Story