NEW IT BILL: కొత్త బిల్లుకు లోక్సభ ఆమోదం

ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు-2025కు తాజాగా ఆమోదం లభించింది. బైజయంత్ పాండా సారథ్యంలోని 31 మంది సభ్యుల సెలక్షన్ కమిటీ సిఫారసుల మేరకు సవరించిన బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రవేశపెట్టిన కొన్ని గంటలలోనే ఏ చర్చా లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం పొందడం గమనార్హం. బిహార్ ఓటర్ల సమగ్ర సవరణపై విపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లుపై చర్చకు తావు లేకుండా పోయిందని చెప్పవచ్చు.
ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025ను ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం లోక్సభ ముందుకు తీసుకొచ్చింది. అయితే విపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించారు. 31 మందితో కూడిన ఈ కమిటీ కీలక సవరణలతో పలు సిఫారసులు చేసింది. సుమారు నాలుగు నెలల పాటు తీవ్రంగా సమీక్షించిన తర్వాత, కమిటీ 285 కంటే ఎక్కువ సిఫార్సులతో 4,500 పేజీలకు పైగా నివేదికను రూపొందించింది. ఈ సూచనల ఉద్దేశ్యం చట్టం భాషను సరళీకృతం చేయడం, నిబంధనలలో స్పష్టత తీసుకురావడం & పన్ను చెల్లింపుదారులకు సమ్మతిని సులభతరం చేయడం. ఇప్పుడు ప్రభుత్వం ఈ మార్పులను కలుపుకొని కొత్త ముసాయిదాను సమర్పించింది. ఆ బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం ఆదాయపు పన్ను బిల్లు-2025 కొత్తగా తీసుకొచ్చింది. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశ పెట్టారు. గత శుక్రవారం రోజునే పాత బిల్లును ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. సెలక్ట్ కమిటీ చేసిన సిఫారసులన్నింటినీ ఆమోదించింది.
66 బడ్జెట్లలో పలు సవరణలు
1961లో రూపొందించిన ఇన్కమ్ ట్యాక్స్ చట్టానికి 66 బడ్జెటల్లో పలు సవరణలు జరిగాయి. దీంతో ట్యాక్స్ అనేది సంక్లిష్టంగా మారిపోయింది. ఈ చట్టాన్ని సమీక్షించి సరళతరం చేయాల్సిన అవసరం ఉందని 2024 జూలైలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ సందర్భంగా కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొత్త బిల్లును సిద్ధం చేశారు. లోక్సభ ఆమోదం పొందిన క్రమంలో రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోదం తెలిపితే కొత్త చట్టంగా మారనుంది. అదే జరిగితే 2026, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది.
కీలక మార్పులు ఇవే..
పాత ఆదాయపు పన్ను చట్టం 1961లోని క్రితం ఏడాది, అసెస్మెంట్ ఇయర్ అనే పదాలు ఉంటాయి. అయితే కొత్త పన్ను బిల్లులో వీటి స్థానంలో పన్ను సంవత్సరం వాడుకలోకి రానుంది. 1961లో మొత్తం 47 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త బిల్లులో అధ్యాయాల సంఖ్యను కేవలం 23కి తగ్గించారు. దీని వల్ల చదవడం, అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ మార్పు ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది. 2025 ఆదాయపు పన్ను బిల్లు కొత్త పన్నులు విధించలేదు. ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ శ్లాబులే కొనసాగుతాయి. రేట్లలోనూ మార్పు లేదు. అలాగే ఐటీఆర్ ఫైలింగ్ గడువు, పన్ను శ్లాబులు, మూల ధన లాభాల్లోనూ ఎలాంటి మార్పులు లేవు. వేతనాల నుంచి డిడక్షన్లు అయిన స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యూటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ వంటివి వేరు వేరు సెక్షన్లు, నిబంధనల కింద ఉన్నాయి. అయితే, వీటిని ఒకే దగ్గరకు తీసుకొచ్చారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com