NEW RULES: ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డు కొత్త రూల్స్

NEW RULES: ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డు కొత్త రూల్స్
X
రూ.10 లక్షల ఖర్చుపై ఐటీ నిఘా...రూ.1 లక్ష క్యాష్ పేమెంట్ రాడార్‌లోకి...బ్యాంకులు ఐటీకి తప్పనిసరి రిపోర్ట్

మారుతున్న కాలంతో పాటు క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు ఆన్‌లైన్ షాపింగ్, అత్యవసర ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులనే ఆశ్రయిస్తున్నారు. అయితే, క్రెడిట్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను శాఖ క్రెడిట్ కార్డు లావాదేవీలపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తూ కొత్త మార్పులు తీసుకొచ్చింది. 1962 నాటి ఆదాయపు పన్ను నిబంధనలను సవరిస్తూ 2026 ముసాయిదాలో ఈ కీలక మార్పులను పొందుపరిచారు.

1. ఐటీ శాఖ నిరంతర నిఘా

ఇకపై భారీ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించే వారిపై ఆదాయపు పన్ను శాఖ నిరంతరం నిఘా ఉంచనుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేస్తే, సదరు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఆ వివరాలను వెంటనే ఐటీ శాఖకు నివేదించాలి. అలాగే, ఒకేసారి రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ నగదు రూపంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లిస్తే అది ఐటీ శాఖ రాడార్‌లోకి వెళ్తుంది.

2. పాన్ కార్డు దరఖాస్తు సులభతరం

కొత్తగా పాన్ (PAN) కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఐటీ శాఖ ఒక వెసులుబాటు కల్పించింది. ఇకపై అడ్రస్ ప్రూఫ్ (చిరునామా రుజువు) కోసం క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌ను కూడా సమర్పించవచ్చు. దీనివల్ల డాక్యుమెంట్ల సేకరణ ప్రక్రియ సులభతరం కానుంది.

3. క్రెడిట్ కార్డుతో ట్యాక్స్ చెల్లింపు

ఇప్పటివరకు ఆదాయపు పన్ను చెల్లించడానికి కేవలం నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డులు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డు ద్వారా కూడా ట్యాక్స్ చెల్లించే సౌకర్యం అమల్లోకి రానుంది. అయితే, ఈ విధానంలో క్రెడిట్ కార్డు సంస్థలు వసూలు చేసే ట్రాన్సాక్షన్ ఛార్జీలు, వడ్డీ రేట్లపై వినియోగదారులు అవగాహన కలిగి ఉండటం అవసరం.

4. కార్డు కావాలంటే 'పాన్' తప్పనిసరి

నకిలీ ఖాతాలను అరికట్టడానికి మరియు పన్ను వ్యవస్థను పటిష్టం చేయడానికి ఇకపై క్రెడిట్ కార్డు దరఖాస్తుకు పాన్ కార్డును తప్పనిసరి చేశారు. పాన్ నంబర్ లేని పక్షంలో బ్యాంకులు క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి వీలు పడదు.

5. కంపెనీ కార్డులపై పన్ను బాదుడు

కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే క్రెడిట్ కార్డుల విషయంలో కూడా నిబంధనలు మారాయి. కంపెనీ కార్డు ద్వారా చేసే వ్యక్తిగత ఖర్చులను పెర్క్విజిట్ గా పరిగణిస్తారు. అంటే దీనిని అదనపు ఆదాయంగా భావించి పన్ను విధిస్తారు. అయితే, ఆ కార్డును కేవలం కంపెనీ పనుల కోసం మాత్రమే వాడితే పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ కొత్త నిబంధనల ద్వారా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడమే కాకుండా, పన్ను ఎగవేతదారుల ఆట కట్టించేందుకు ఐటీ శాఖ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కేవలం పన్నుల పరంగానే కాకుండా, మీ ఆదాయానికి మించిన ఖర్చులు క్రెడిట్ రిపోర్టింగ్‌లో ప్రతిబింబిస్తే భవిష్యత్తులో లోన్ పొందే అవకాశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

Tags

Next Story