Real Estate: సొంతింటి కల ఈ ఏడాదే నెరవేరేలా.. వచ్చే ఏడాది ధరలు మరింతగా..

Real Estate: సొంతింటి కల ఈ ఏడాదే నెరవేరేలా.. వచ్చే ఏడాది ధరలు మరింతగా..
Real Estate: వచ్చే ఏడాది ఇండ్ల ధరలు ఐదు శాతం పెరుగుతాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి.

Real Estate: ఏ ఏడాదికి ఆయేడు రియల్టీ మార్కెట్ విస్తరిస్తోంది.. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని వస్తువుల ధరలు పెరగుతుండడంతో నిర్మాణ వ్యయం పెరుగుతోంది.. దాంతో ప్రాజెక్ట్ యాజమాన్యం ఇళ్ల ధరలను పెంచేస్తోంది. మధ్య తరగతి మానవుడికి సొంతింటి కల అందని ద్రాక్షే అవుతుంది.

వచ్చే ఏడాది ఇండ్ల ధరలు ఐదు శాతం పెరుగుతాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. ఏరియాతో పాటు, మెరుగైన వసతులు కోరుకుంటున్న కొనుగోలు దారులను దృష్టిలో పెట్టుకుని రియల్టర్లు ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. వచ్చే 12 నెలల్లో ఇండ్ల ధరలు పెరుగుతాయని ఓ సర్వే వెల్లడించింది. కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు కొంత చక్కదిద్దుకున్నాయి. దీంతో రియల్ ఎస్టే్ట్ మార్కెట్ ఊపందుకుంది.

ఐటీ ఉద్యోగులు నివసించే ఏరియాలు మాదాపూర్, గచ్చిబౌలి.. వీటికి సమీపంలోని కొండాపూర్, మియాపూర్, హఫీజ్‌పేట, కేపీహెచ్‌బీ, ప్రగతి నగర్, నిజాంపేట, కూకట్‌పల్లిలో ఇప్పటికే భారీ ఎత్తున అపార్ట్‌మెంట్లు వెలిశాయి. ప్రస్తుతం అందుబాటు ధరలో ఉన్న ఏరియా అంటే బాచుపల్లిని చెప్పుకోవచ్చు. స్థానికంగా అంతర్జాతీయ విద్యా సంస్థలు, వినోద కేంద్రాలు, ఆసుపత్రులు ఉండడంతో బాచుపల్లికి డిమాండ్ పెరిగింది.

మియాపూర్, కేపీహెచ్‌బీ వంటి వాణిజ్య కేంద్రాలు కూడా ఇక్కడకు చేరువలో ఉన్నాయి. నిజాంపేట, ప్రగతినగర్, బౌరంపేట, మోమిన్‌పేట, గాజులరామారం ఇలా చుట్టూ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు రహదారులు ఉన్నాయి. మియాపూర్ నుంచి గండిమైసమ్మ మీదుగా మేడ్చల్ వరకు జాతీయ రహదారి ఉంది.

పైగా ఈ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్‌కు ఆనుకుని ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులభంగా దూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకోవచ్చు. మియాపూర్ మెట్రోస్టేషన్, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌కు 10కి.మీ దూరం ఉంటుంది. సిటీలో మెట్రో సౌకర్యం అందుబాటులో ఉండడంతో ఏ ప్రాంతానికైనా నిమిషాల్లో చేరుకునే వీలుంది.

ఇదివరకు ఈ ఏరియాలో నీటి సమస్య ఉండేది.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. జలమండలి ప్రత్యేక పైపు లైన్లు వేయడంతో ఆ సమస్య తీరిపోయింది. గోదావరి, మిషన్ భగీరథ నీరు కూడా బాచుపల్లి ఏరియాకు వచ్చేశాయి. కాలుష్య ఉద్గారాలను కూడా ఔటర్ బయటకు తరలిస్తుండడంతో ఇక్కడ ఆవాసయోగ్యానికి అనుకూలంగా ఉంది. కొత్త కొత్త వెంచర్లు వెలుస్తుండడంతో బాచుపల్లి ఏరియాకు డిమాండ్ మరింత పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story