NIRMALA: నెక్స్ట్ టార్గెట్ ఇదే.. నిర్మలా సీతారామన్

భారీ సంస్కరణలకు సంబంధించి తదుపరి అజెండాలో కస్టమ్స్ నిబంధనలను సరళతరం చేయడం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వాటిని మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆదాయ పన్ను రేట్లు, వస్తు..సేవల పన్నుల (జీఎస్టీ) క్రమబద్ధీకరణ తదితర సంస్కరణలను అమలు చేసినట్లు ఆమె వివరించారు. ఇక కస్టమ్స్ డ్యూటీ రేట్లను క్రమబదీ్ధకరించడంపై దృష్టి పెట్టనున్నట్లు మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో దీనిపై ప్రకటనలు ఉండొచ్చని ఆమె వివరించారు. గత రెండేళ్లుగా కస్టమ్స్ సుంకాన్ని తాము గణనీయంగా తగ్గించామని తెలిపారు.
అంతర్జాతీయ వాణిజ్యంలో భారత పోటీతత్వాన్ని పెంచేందుకు కస్టమ్స్ విధానాల్లో ఆధునీకరణ అత్యవసరమైందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారని మంత్రి సూచించారు. సరుకుల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయడం, పేపర్‌లెస్ విధానాలను మరింత విస్తరించడం, రిస్క్ మేనేజ్మెంట్ను మెరుగుపరిచే చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ చర్యలతో ఎగుమతులు, దిగుమతుల సంబంధిత ఖర్చులు తగ్గి దేశీయ పరిశ్రమలకు మరింత అవకాశాలు కలుగుతాయని తెలిపారు. అదేవిధంగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశ ర్యాంకును మెరుగుపరిచేందుకు కస్టమ్స్ విభాగం కీలకంగా మారబోతోందని ఆమె అన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా పారదర్శకమైన, అంచనాలు స్పష్టంగా ఉండే కస్టమ్స్ విధానాలు ఎంతో అవసరమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వ్యాపార వర్గాల నుంచి వచ్చిన సూచనలను ప్రభుత్వం ఇప్పటికే పరిశీలనలోకి తీసుకుని రాబోయే బడ్జెట్లో వాటికి అనుగుణంగా విధానాలు ప్రకటించే అవకాశం ఉన్నదని ఆమె వెల్లడించారు.
రూపాయి పడిపోవడం మంచిదే
డాలర్‌తో రూపాయి విలువ 90కి చేరినప్పటికీ, కరెన్సీ విలువ దానికదే సర్దుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రూపాయి స్థాయిని అదే నిర్ణయించుకోవాలని కామెంట్ చేశారు. ఈ విషయంలో ప్రత్యేకంగా టార్గెట్లను పెట్టుకోలేదని చెప్పారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ .. రూపాయి విలువ తగ్గడం వల్ల ఎగుమతిదారులకు లాభం ఉంటుందన్నారు. ఆర్థిక వృద్ధి పై స్పందిస్తూ.. ఇక నుంచి కూడా జోరు కొనసాగుతుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో మనదేశ వృద్ధిరేటు ఏడు శాతం మించుతుందని తెలిపారు. సెప్టెంబరు క్వార్టర్లో మాదిరే ఇక నుంచి కూడా వృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆర్బీఐ వృద్ధి అంచనాను 7.3 శాతానికి పెంచిన నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు.
మార్కెట్లో ఊహించని లేదా తీవ్రమైన అస్థిరత ఏర్పడినప్పుడు మాత్రమే రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకుంటుందని ఆమె తెలిపారు. రూపాయి విలువలో అధిక హెచ్చుతగ్గులు ఏర్పడి దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నప్పుడు, మార్కెట్‌ను స్థిరీకరించేందుకు మాత్రమే ఆర్బీఐ రంగంలోకి దిగుతుందని ఆమె వివరించారు. ఈ జోక్యం రూపాయికి ఒక నిర్దిష్ట విలువను ఇవ్వడానికి కాదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లతో పోరాడుతున్నాయని, అన్ని దేశాల కరెన్సీలపైనా ఒత్తిడి ఉందని ఆమె తెలిపారు. ఈ గ్లోబల్ అనిశ్చితి భారత రూపాయిపై కూడా ప్రభావం చూపుతున్నప్పటికీ,ఇతర అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి మెరుగ్గా, స్థిరంగా ఉందని అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

