Nisha Madhulika: 62 ఏళ్ల ఆంటీ యూట్యూబ్ ఛానెల్.. వంటలతో ఏడాదికి రూ.2 కోట్ల సంపాదన

Nisha Madhulika: 62 ఏళ్ల ఆంటీ యూట్యూబ్ ఛానెల్.. వంటలతో ఏడాదికి రూ.2 కోట్ల సంపాదన
Nisha Madhulika: ఆమె 47 ఏళ్ల వయసులో కంప్యూటర్ నేర్చుకుని సొంత బ్లాగ్ ఏర్పాటు చేసుకుంది.. అందులో భారతీయ వంటలకు సంబంధించిన ఎన్నో విషయాలు రాసి పోస్ట్ చేసేది.

Nisha Madhulika: 60 ఏళ్ల వయసులో ఉన్న అమ్మమ్మా, తాతయ్యలు ఏం చేస్తారు.. మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ, మందులు వేసుకుంటూ, మనవడు మనవరాళ్లతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తుంటారు.. కానీ నిషా ఆంటీ అందరిలా కాదు.. ఆహా ఏమి రుచి అంటూ వంటల ఛానల్ ప్రారంభించి ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత భారతీయ చెఫ్ నిషా మధులిక తన వయసు వారితో పాటు టీనేజర్స్‌కి కూడా రోల్ మోడల్‌గా నిలుస్తోంది.

సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నిషా పెళ్లైన తరువాత 'ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్' అనే వ్యాధితో బాధపడింది.. అంటే ఖాళీగా ఉండడంతో డిప్రెషన్‌లోకి వెళ్లింది. దాంతో డాక్టర్లు తన అభిరుచికి తగ్గ పని ఏదైనా చేయమని సలహా ఇచ్చారు. దాంతో ఆమె 47 ఏళ్ల వయసులో కంప్యూటర్ నేర్చుకుని సొంత బ్లాగ్ ఏర్పాటు చేసుకుంది.. అందులో భారతీయ వంటలకు సంబంధించిన ఎన్నో విషయాలు రాసి పోస్ట్ చేసేది. అవి చదివిన వారు ఆంటీ వంటల గురించి చక్కగా రాస్తున్నారు..

అవి మీరే తయారు చేసి యూట్యూబ్‌లో పెట్టొచ్చు కదా అని అడిగేవారు. దాంతో ఆమెకి కూడా వాళ్ల మాటలు నచ్చడం.. వంటల పట్ల తనకున్న అభిరుచి కలిసి 2011లో సొంత యూట్యూబ్ ఛానెల్ 'ఫుడ్ అండ్ రెసిపి' ని ప్రారంభించింది. ఇప్పటి వరకు 242 కోట్ల 88 లక్షల మంది వీక్షించగా, 1.22 కోట్ల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఇక యూట్యూబ్ ద్వారా ఏటా రూ.2 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత ఏడాదే సబ్‌స్క్రైబర్స్ కోటి దాటారని యూట్యూబ్ డైమండ్ ప్లే బటన్ దక్కించుకుంది.

2014 సంవత్సరంలో, నిషా మధులిక యూట్యూబ్ టాప్ చెఫ్‌గా, 2017లో సోషల్ మీడియా సమ్మిట్ & 2017అవార్డ్స్‌లో టాప్ యూట్యూబ్ క్యూలినరీ కంటెంట్ క్రియేటర్‌గా అవార్డును పొందింది. ఎకనామిక్ టైమ్స్ మేగజైన్‌లో "భారతదేశంలోని టాప్ 10 YouTube ప్రముఖులు" గా నిషా పేరు జత చేయబడింది. 2016 సంవత్సరంలో, ఆమె వోడాఫోన్ యొక్క 'విమెన్ ఆఫ్ ప్యూర్ వండర్' కాఫీ టేబుల్‌లో కూడా నటించింది.

2017లో, నిషా మధులికకు టాప్ యూట్యూబ్ కుకింగ్ స్టఫ్ క్రియేటర్ అవార్డు లభించింది. శాఖాహార వంటలు చేయడంలో ఆమె ప్రసిద్ధి.. ఇప్పటి వరకు 1700ల వీడియోలు చేసింది. ఛానెల్ ప్రారంభించిన కొత్తల్లో కొంత తడబడ్డా ఆ తరవాత మెల్లగా అలవాటైపోయింది. వ్యూయర్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.. భర్త కూడా తన బిజినెస్ వదిలేసి భార్య ఛానెల్‌కు సంబంధించిన విషయాలు చూస్తున్నారు. ఖాళీ సమయాల్లో సంగీతం వినడం, పుస్తకాలు చదవడం నిషాకు అత్యంత ఇష్టమైన హాబీలు.

మీ అభిరుచిని కొనసాగించడానికి వయసుతో సంబంధం లేదు.. యువకులకు, పెద్ద వయసు వారికి ప్రతి ఒక్కరికీ వేదిక అవుతుంది సోషల్ మీడియా.. ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుండాలి అని చెబుతుంది నిషా. ఏదైనా ఇష్టంతో చేస్తే అస్సలు కష్టం అనిపించదని అంటుంది. పక్కింటి వాళ్లతో కబుర్లు, టీవీల్లో వచ్చే సీరియల్స్ చూసి టైమ్ వేస్ట్ చేసుకోవడం, మనసు పాడు చేసుకోవడం అస్సలు నచ్చని విషయాలు నిషాకి. వంటలకి సంబంధించిన పుస్తకాలు చదువుతూ కొత్త కొత్త ప్రయోగాలు చేయడం తనకి చాలా ఇష్టమైన పని.

Tags

Read MoreRead Less
Next Story