Real Estate: ఆన్‌లైన్‌లో ఇళ్ల కొనుగోలు.. పుంజుకున్న రియల్ రంగం

Real Estate: ఆన్‌లైన్‌లో ఇళ్ల కొనుగోలు.. పుంజుకున్న రియల్ రంగం
Real Estate: ఏరియా నుంచి మొదలు ధరలు ఎంతలో ఉన్నాయి తదితర విషయాలన్నీ ప్రాపర్టీ సేల్స్‌లో పెడుతున్నారు.

ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకుల పరుగుల జీవితం.. పక్కనే ఉన్న షాపు వెళ్లాలన్న టైమ్ లేదు.. ఆన్‌లైన్లో బుక్ చేస్తే అన్నీ ఇంటికే వస్తున్నాయి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఆన్‌లైన్లో జోరందుకుంది. ఏరియా నుంచి మొదలు ధరలు ఎంతలో ఉన్నాయి తదితర విషయాలన్నీ ప్రాపర్టీ సేల్స్‌లో పెడుతున్నారు.

ఇంకా డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటోంది. కరోనాకి ముందు ఆన్‌లైన్ సెర్చింగ్ ప్రాపర్టీ కొనుగోలు విషయంలో 39 శాతం ఉంటే.. ఇప్పుడది 60 శాతానికి పెరిగిందని ఓ సర్వే వెల్లడించింది. అక్కడికి వెళ్లి చూడాలంటే అసలు వీలు పడని పరిస్థితి. ఆన్‌లైన్‌లో చూసి ఒక అవగాహనకు వస్తున్నారు. అంతా బావుంది అనుకుంటే ఒకసారి స్వయంగా వెళ్లి చూసి ఓకే చేస్తున్నారు.

రియల్ సంస్థ ఎదుగుదలకు పటిష్టమైన ఆన్‌లైన్ మార్కెటింగ్ బృందంతో పాటు, సోషల్ మీడియా వేదికలు ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో నిలబడగలుగుతున్నాయి. ఎక్కువ మంది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇకపోతే కాస్త ఎక్కువైనా ఆర్థిక స్థోమత ఉన్న వారు బ్రాండెడ్ ప్రాజెక్ట్‌లలో కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.

కరోనా తర్వాత అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దీంతో రియల్ కస్టమర్లు ఇంటి చుట్టూ ఖాళీ స్పేస్, ఇంట్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే వీలున్న ఇళ్లకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ వంటి ఆధునిక సౌకర్యాలు లేకపోయినా పర్లేదు కానీ ఇంటి చుట్టూ గార్డెన్ ఏరియా ఉంటే మంచిదనుకుంటున్నారు.

ఆన్‌లైన్‌లోనే ఇలాంటి సౌకర్యాలు అన్నీ ఉన్నాయో లేదో చూసుకుని ఇల్లు కొనుగోలుకు ముందడుగు వేస్తున్నారు. ఎంతో కష్టపడి ఇష్టంగా కొనుక్కునే ఇల్లు.. ఇంట్లో అందరికీ నచ్చేలా.. ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటే సంతోషం.

Tags

Read MoreRead Less
Next Story