Petrol, diesel price hike: తగ్గేదేలే.. వరుసగా నాలుగో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు..

Petrol, diesel price hike: తగ్గేదేలే.. వరుసగా నాలుగో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు..
Petrol, diesel price hike: పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గేదేలే అంటున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి.

Petrol, diesel price hike: పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గేదేలే అంటున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. గత మంగళవారం నుంచి 25 పైసలు, 30 పైసల చొప్పున పెరుగుతున్నాయి. ఒకప్పుడు.. ఎప్పుడో ఒకసారి రూపాయి, రెండు రూపాయలు పెరిగేవి. ఇప్పుడు రోజుకింత చొప్పున వారానికి రూపాయి చొప్పున పెరుగుతోంది.

ఇప్పటికే తెలంగాణలో లీటర్ డీజిల్ వంద రూపాయలు దాటింది. పెట్రోల్ లీటర్‌ 107 రూపాయలైంది. రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో సామాన్యులకు ఆర్థిక భారం పెరుగుతోంది. అటు గ్యాస్‌ రేట్లను కూడా పెంచుతుండడంతో సగటుజీవిపై పండగ వేళ మోయలేని భారం పడుతోంది.

పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ రేట్లు పెరిగితే.. దాదాపు అన్ని ఉత్పత్తులపైనా ఆ ప్రభావం పడినట్టే. రవాణా ఛార్జీలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి.

సరిగ్గా గత ఆదివారం పెట్రోల్‌పై 25 పైసలు, మంగళవారం మరో 25 పైసలు, బుధవారం 30 పైసలు, గురువారం 34 పైసలు, ఇవాళ మరో 30 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్ పైన 35 పైసలు పెరిగింది. అంటే రమారమి వారం కూడా పూర్తికాకుండానే లీటర్‌ పెట్రోల్‌పై రూపాయిన్నర పెరిగింది.

డీజిల్‌ రేట్ అయితే పెట్రోల్‌ రేటును మించి పెరిగింది. తెలంగాణ, ఏపీతో సహా మహారాష్ట్ర, రాజస్తాన్, ఒడిశాలో డీజిల్ ధర రూ.100 దాటేసింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ 107 రూపాయల 71 పైసలుగా ఉంది. డీజిల్ 100 రూపాయల 51 పైసలకు పెరిగింది.

ఢిల్లీలో అయితే పెట్రోల్‌ ధర ఆల్ టైమ్ హైకి చేరింది. ఇంధన ధరలు తగ్గించిన తమిళనాడులోనూ లీటర్‌ పెట్రోల్‌ ఇప్పుడు 100 రూపాయలు దాటింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో అయితే పెట్రోల్ 110 రూపాయలు క్రాస్ చేసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు పెరుగుతుండడంతో.. దానికి అనుగుణంగా దేశీయ చమురు సంస్థలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలు సవరిస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 80 డాలర్లు క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మూడేళ్ల గరిష్ట స్థాయికి తాకడంతో ఇక్కడి కంపెనీలు కూడా రేట్లు పెంచుతున్నాయి.

అయితే, పెరుగుతున్న రేట్ల కంటే.. వాటిపై విధించిన పన్నుల భారమే.. సామాన్యులను అతలాకుతలం చేస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్రాలు ఎక్కువ పన్నులు వేసిన కారణంగానే ప్రజలపై భారం పడుతోంది. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ రేట్‌లో 54 శాతం పన్నులే. కేంద్రం పెట్రోల్‌పై దాదాపు 33 రూపాయలు, డీజిల్‌పై 32 రూపాయలు వసూలు చేస్తోంది. వీటికి అదనంగా రాష్ట్రాలు సైతం పన్నులు వేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story