Chicken Feathers: బావుందయ్యా బిజినెస్.. కోడి ఈకలతో వ్యాపారం.. కోట్లలో టర్నోవర్..

Chicken Feathers: బావుందయ్యా బిజినెస్.. కోడి ఈకలతో వ్యాపారం.. కోట్లలో టర్నోవర్..
Chicken Feathers: వారికి వచ్చిన ఆలోచనను అందరూ ఎగతాళి చేసినా అవేవీ పట్టించుకోకుండా ఆచరణలో పెట్టారు.

Chicken Feathers: వారికి వచ్చిన ఆలోచనను అందరూ ఎగతాళి చేసినా అవేవీ పట్టించుకోకుండా ఆచరణలో పెట్టారు. తామేంటో నిరూపించుకున్నారు. కోడి ఈకలతో బట్టలా.. నీకేమైనా పిచ్చిపట్టిందా అన్నవాళ్లే ఇప్పుడు వారితో బిజినెస్ చేయడానికి చేతులు కలుపుతామంటున్నారు.. వారి సక్సెస్ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం.. అసలింతకీ కోడి ఈకలతో దుస్తులు తయారు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందో వివరిస్తున్నారు..

చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తున్నారు. ఇంక పనికి రావు అని పడేస్తున్న వస్తువుల నుంచి అద్భుతమైన కళాఖండాలే సృషిస్తున్నారు ఔత్సాహికులు. ఏదైనా మనసుంటే మార్గం ఉంటుంది అనేదానికి ఉదాహరణగా నిలుస్తున్నారు.

ఎగ్ఫ్రై, చికెన్ 65 వంటి అద్భుత వంటకాలే కాదండోయే కోడి మనకు ఇచ్చేది.. ఈకలు కూడా పనికొస్తాయి అంటున్నారు జైపూర్‌కి చెందిన ముదిత, రాధేష్ దంపతులు.

కాలేజీలో వచ్చిన ఐడియాకు తమ కఠోర శ్రమ, అభిరుచితో దాన్ని కంపెనీగా మార్చిన ఈ దంపతులు నేడు కోట్లలో టర్నోవర్‌ని ఆర్జిస్తున్నారు.

ముదిత & రాధేష్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ముదిత మాట్లాడుతూ, "నేను జైపూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ నుండి రాధేష్‌తో కలిసి ఎంఏ చేస్తున్నప్పుడు, వ్యర్థ పదార్థాలతో కొత్త వస్తువులను తయారు చేసే ప్రాజెక్ట్ నాకు ఇవ్వబడింది.

ఒకరోజు రాధేష్ ప్రక్కన ఉన్న చికెన్ షాపులో ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ నిలబడి ఉన్నాడు. అక్కడ కోడి ఈకలను చేత్తో వీటిని ఏం చేస్తారని అడిగాడు. వ్యాపారి చెత్తతో పాటుగా పడేస్తామని చెప్పాడు.

దాంతో రాధేష్, ముదితలు కలిసి అవే తమ కొత్త ప్రాజెక్టుకు ఆధారం అని అనుకున్నారు. సుదీర్ఘ పరిశోధన తర్వాత కేవలం 16 వేల రూపాయలతో ప్రారంభించిన తమ వ్యాపారం గత రెండున్నరేళ్లలో దాదాపు 7 కోట్ల వ్యాపారం చేయగా ప్రస్తుతం కంపెనీ వార్షిక టర్నోవర్ 2.5 కోట్లు.

రాధేష్ కుటుంబం పూర్తిగా శాఖాహారం కాబట్టి, అతను ప్రాజెక్ట్ గురించి కుటుంబాన్ని సంప్రదించినప్పుడు, కుటుంబం నిరాకరించింది.

ప్రాజెక్ట్‌లో పనిచేస్తూనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఆపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. రాధేష్, ముదిత ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ కోసం నిర్విరామంగా శ్రమించారు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత తమ కష్టానికి ఫలితం దక్కింది.

ఇంతకు ముందు ఎవరూ అలాంటి బట్టను తయారు చేయలేదు కాబట్టి, పుస్తకాలలో మరియు ఇంటర్నెట్‌లో కూడా దాని గురించి ఎక్కువ సమాచారం లేదు. చాలా పరిశోధన తర్వాత, కోడి ఈకలను శుభ్రం చేయడానికి ఒక పద్ధతిని కనుగొన్నాడు.

కాలేజీ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు కూడా వారి ప్రాజెక్టుకు సహకరించకపోగా డర్టీ వర్క్ అని అసహ్యించుకునేవారు. వారికి సహాయం చేయడానికి నిరాకరించేవారు.

నిధులతో క్లీనింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం, నేత కార్మికులకు శిక్షణ ఇవ్వడం, తుది ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకురావడం వంటి సవాళ్లను ఎదుర్కొని సంస్థను నిర్మించినట్లు రాధేష్ చెబుతున్నారు.

ప్రస్తుతం 1200 మంది కార్మికులు కోడి ఈకలతో చక్కటి బట్టను తయారు చేస్తున్నారు. ఒక్కో కార్మికుడికి నెలకు రూ.8 వేల నుంచి 12 వేల వరకు ఇస్తున్నామని తెలిపారు. నేడు, చాలా కంపెనీలు యంత్రాలు ఏర్పాటు చేసుకోవడంతో కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. కానీ ముదిత, రాధేష్ ఎక్కువ మంది నేత కార్మికులను భాగస్వామ్యం చేసారు. సమాజంలో వారికి ఒక గుర్తింపు కల్పించాలని ప్రయత్నిస్తున్నారు.

కోడి ఈకలతో తయారు చేసిన శాలువలను వాడేందుకు మన దేశ ప్రజలు సిగ్గుపడతారని, అయితే విదేశాల్లో వీటికి చాలా డిమాండ్ ఉందని ముదిత చెబుతోంది. వారి ఉత్పత్తులు చాలా వరకు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.

Tags

Read MoreRead Less
Next Story