Ratan Tata: నానో కారులో రతన్ టాటా.. నిరాడంబరతకు నిలువెత్తు రూపం..

Ratan Tata: మధ్యతరగతి వాసి కష్టాలను కళ్లారా చూసిన రతన్ టాటా నానో కారుకు రూపకల్పన చేశారు.. లక్షరూపాయల్లో కారు అదించి భేష్ అనిపించుకున్నారు.. తొలినాళ్లలో విపరీతంగా అమ్ముడుపోయిన ఆ కారు రాను రాను దానికి ఆదరణ తగ్గి 2018లో దాని తయారీని నిలిపివేసింది కంపెనీ.
అయితే ఆ కారు మీద అభిమానం మాత్రం తగ్గలేదు రతన్ టాటాకి. వారం రోజుల క్రితం సామాన్యుల కోసం 2008లో తీసుకు వచ్చిన నానో కారు విశేషాలను పంచుకున్నారు ట్విట్టర్ వేదికగా.. ఆ ఏడాది ఆటో ఎక్స్ పోలోల నానో కారును ఆవిష్కరిస్తున్న ఫోటోను షేర్ చేసి ఆనాటి సంగతిని గుర్తు చేసుకున్నారు. నానో కారు తయారీకి ప్రేరణ..
చాలా కుటుంబాలు తరచూ తమ పిల్లలతో కలిసి స్కూటర్లపై ప్రయాణించడాన్ని చూశారు.. గతుకుల రోడ్లమీద, వర్షాకాలంలో తడుస్తూ వెళుతున్న ఫ్యామిలీలు నాకంట పడ్డాయి. ఆ చిన్న కుటుంబాలకు సౌకర్యవంతంగా ఉండే ఓ చిన్న వాహనం.. అది కూడా వారికి అందుబాటులో ఉండే ధరలో తయారు చేయాలని సంకల్పించాము.. ముందు టూ వీలర్ గురించే ఆలోచించాము.. కానీ అది ప్రయోగ దశలో కారుగా మారింది.. అంటూ నానో కారుకు ప్రేరణ ఇచ్చిన అంశాన్ని వివరించారు.
అయితే.. ఎంత సంపాదించినా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే మనస్థతత్వం ఉన్న మన రతన్ టాటా.. ఇప్పటికీ అదే కారులో ప్రయాణిస్తుంటారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల రతన్ టాటా తనకు ఎంతో ప్రత్యేకమైన ఆ కారులో తాజ్ హోటల్ కు వచ్చారు.
ఆ సమయంలో ఆయన పక్కన బాడీ గార్డ్స్ కూడా లేరు.. తన సహాయకుడు శంతన్ నాయుడు, హోటల్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి రతన్ జీపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. నిరాడంబరతకు నిలువెత్తు రూపం అంటున్నారు.. మీ నుంచి చాలా నేర్చుకోవాలి సార్ అంటూ స్పందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com