RBI: కీలక వడ్డీరేట్లను పెంచిన ఆర్బీఐ.. రెపోరేటు కూడా పెంపు..

RBI: ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ వడ్డీరేట్లను మరోసారి పెంచింది. దీంతో గత 5 వారాల వ్యవధిలో రెపోరేటు రెండుసార్లు పెరిగినట్లయింది. గత నెల్లో రెపోరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచగా.. తాజాగా మరోమారో దీనిని 50 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్‌బీఐ. తాజా పెంపుతో రెపో రేటు 4.90శాతానికి పెరిగింది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. వడ్డీరేట్ల పెంపుపై ఎంపీసీ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
క్లిష్ట సమయాల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.2శాతంగా నమోదు కావచ్చని, అలాగే ద్రవ్యోల్బణం రేటు కూడా 6.7శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఇక ప్రభుత్వ రుణ కార్యక్రమాన్ని క్రమబద్దంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్‌ను జాగ్రత్తగా గమనిస్తున్నామని వెల్లడించింది. పాలసీ రేట్ల పెంపుతో పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 4శాతం పెరిగి మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి.
ఇక రికరింగ్ పేమెంట్స్‌ను మరింత సులభతరం చేసింది ఆర్‌బీఐ. రికరింగ్ పేమెంట్స్ పరిమితిని 5 వేల రూపాయల నుంచి 15వేల రూపాయలకు పెంచినట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. మరోవైపు కో-ఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించి ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. తమ మొత్తం ఆస్తుల్లో 5శాతం పరిమితితో రెసిడెన్షియల్ హౌజింగ్ ప్రాజెక్ట్‌ల కోసం రుణాలిచ్చేందుకు గ్రామీణ సహకార బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. అలాగే ఇంటింటికి బ్యాంకింగ్ సేవలను విస్తరించడానికి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కు క్రెడిట్‌కార్డులను లింక్ చేసేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. ఇక కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ పెంచడంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. ఇక ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐలలో ఎలాంటి మార్పూ చేయనప్పటికీ ఈఎంఐలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగుతుంది. ఆ లెక్కన సుదీర్ఘకాలం పాటు ఈఎంఐలు కట్టినప్పుడు ఆ విధంగా కట్టే వడ్డీ మొత్తం కూడా పెరగబోతోంది.
మే నెలలో పెంచిన 40 బేసిస్ పాయింట్లు, తాజాగా పెంచిన 50 బేసిస్ పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటే ఒక లక్ష రూపాయల లోన్‌పై 55 రూపాయల వరకు ఈఎంఐ పెరగనుంది.. 20 ఏళ్ల కాలపరిమితితో ఓ పాతిక లక్షలు హౌసింగ్ లోన్ తీసుకుంటే ఏడు శాతం వడ్డీతో నెలకు 1374 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఏడేళ్లకు 10 శాతం వడ్డీ కింద 10 లక్షల రూపాయల వెహికల్ లోన్ తీసుకుంటే ఈఎంఐ 469 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com