చరిత్రలోనే తొలిసారిగా మాంద్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ?

చరిత్రలోనే తొలిసారిగా భారత్ ఆర్థిక మాంద్యంలోకి అడుగుపెట్టబోతోందా... RBI నిపుణులు అదే అంచనాలు అలాగే ఉన్నాయి. కొవిడ్ మహమ్మారి కారణంగా వరుసగా రెండో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధిరేటు క్షీణించిందని.. దీని అర్థం... భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని ఆర్‌బీఐలోని నిపుణులు అభిప్రాయపడ్డారు. కొవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం క్షీణించింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలోనూ వృద్ధిరేటు 8.6శాతం క్షీణించే అవకాశాలున్నట్లు RBI నౌకాస్ట్ విధానంలో తొలిసారి విడుదల చేసిన అంచనాల్లో నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో భారత్ సాంకేతికంగా ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిందని మానిటరీ పాలసీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పంకజ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
వరుసగా రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు క్షీణించే అవకాశాలు కన్పిస్తున్నాయంటున్నారు RBI నిపుణులు. దీంతో చరిత్రలో తొలిసారిగా భారత్ సాంకేతికంగా మాంద్యంలోకి అడుగుపెట్టిందని ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ పేరుతో రాసిన ఆర్టికల్‌లో పంకజ్ కుమార్ వెల్లడించారు. అయితే దశలవారీగా కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తే క్షీణతను అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడంతో మే, జూన్‌లో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకొందని ఆర్టికల్‌లో పేర్కొన్నారు.
జూలై-సెప్టెంబరు త్రైమాసిక ఫలితాల అంచనాల కోసం ఆర్థికవేత్తలు, పరిశోధకులు నౌకాస్టింగ్ అనే విధానాన్ని ఉపయోగించారు. ఇందులో వేర్వేరు సమాచారాల్ని విశ్లేషించి ఈ అంచనాలకు వచ్చారు. ఆర్‌బీఐ నెలవారీ బులిటెన్‌లో ఈ ఆర్థికవేత్తల అంచనాలను ప్రచురించారు. అయితే, వీటిని కచ్చితంగా RBI అభిప్రాయాలుగా భావించకూడదని అంటున్నారు. రెండో త్రైమాసిక గణాంకాలు, అంచనాలను RBI ఇంకా విడుదల చేయలేదు. నవంబరు చివరి వారంలో అధికారిక జీడీపీ గణాంకాలు వెలువడే అవకాశముంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఆర్థిక వ్యవస్థ 9.5శాతం క్షీణించే అవకాశాలున్నాయని RBI గతంలోనే అంచనా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com