Jio Phone: జియో నుంచి మరో సంచలనం, 999కే 4G ఫోన్

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో సంచలనానికి తెరతీసింది. జియో ఆరంభంలో కొన్ని నెలలపాటు 4G ఇంటర్నెట్‌ని ఉచితంగా అందించి దేశీయ స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వినియోగం దశ దిశనే మార్చేసింది. ఇప్పుడు రూ.999లకే 4G ఇంటర్నెట్ సౌకర్యం ఉండే ఫీచర్ ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చింది. 'భారత్ V2' పేరుతో సోమవారం ఆవిష్కరించింది. జులై 7 నుంచి 10 లక్షల ఫోన్లతో బీటా ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
2G ఫోన్ల వాడకం తగ్గించాలనే లక్ష్యంతో 2G-ముక్త్ భారత్ అనే విజన్‌తో దేశంలోని ఇప్పటికీ వినియోగంలో ఉన్న సుమారు 25 కోట్ల ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఇంటర్నెట్ ఆధారిత ఫోన్ అందించాలనే లక్ష్యంతో దీనిని తెచ్చామని వెల్లడించింది.
తన పోటీ సంస్థలకు మళ్లీ గుబులు పుట్టిస్తోంది. అంతే కాకుండా తన పోటీ సంస్థల కంటే అతి తక్కువ ధరలకే, 7 రెట్లు ఎక్కువ డేటాతో ఆఫర్లు ప్రకటించింది. కేవలం రూ.123 రీఛార్జితో అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు, 14GB(రోజుకి 0.5GB) డేటా ప్రతి నెలా అందించనుంది. ఇతర ఆపరేటర్లు రూ.179 వసూలు చేస్తున్నారని తెలిపింది.
వార్షిక ప్లాన్ రూ.1234 తో ప్రవేశపెట్టింది. సంవత్సరానికి 168GB(రోజుకి 0.5GB) డేటా, ఉచిత అన్‌లిమిటెడ్ కాల్స్ అందించనుంది.
2G ఫోన్ల వాడకం తగ్గించడమే లక్ష్యం..
రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ... దేశంలో ఇప్పటికీ 25 కోట్ల ఫోన్లు 2G ఫోన్లలలోనే చిక్కుకుపోయాయి. ప్రపంచమంతా 5G విప్లవంతో ముందుకు వెళ్తుంటే, వీరు మాత్రం 2G కాలంలోనే చిక్కుపోయారన్నాడు. 6 యేళ్ల క్రితం జియోని ప్రవేశపెట్టినప్పుడు కూడా మా లక్ష్యం ఇదే. భారతదేశంలోని ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్‌ని చేరువచేసి, దాని ప్రతిఫలాలు ప్రతి ఒక్కరూ పొందాలనేదే మా లక్ష్యం. టెక్నాలజీ అనేది ఒక్కరి సొత్తు ఏం కాదు అని అన్నాడు.
ఆ దిశగా వెళ్తున్న మాకు ఈ నూతన జియో ఫోన్(Bharath V2) మరో ముందడుగు. మా ఆవిష్కరణలకు ఇది కేంద్రంగా ఉంటుంది. విభిన్న వర్గాల వినియోగదారులకు ఇది చేరువై తమ లక్ష్యాల్ని నెరవేరుస్తుందని వెల్లడించాడు. డిజిటల్ సేవలు పొందడంలో దేశంలో ఉన్న అసమానతలు తగ్గించి, ప్రతి ఒక్కరిని డిజిటల్ విప్లవంలో భాగం చేస్తామని వెల్లడించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com