బంగారం ధరల్లో రివర్స్ ట్రెండ్..

బంగారం ధరల్లో రివర్స్ ట్రెండ్..

బంగారం ధరల్లో రివర్స్ ట్రెండ్ మొదలైంది. నెల రోజులుగా ఎల్లోమెటల్ ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. మరికొన్ని వారాల పాటు పసిడి తళుకులు తగ్గొచ్చని డేటా చెబుతోంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే రోజు చాలా త్వరలోనే ఉందన్న సిగ్నల్స్ ఇన్వెస్టర్లలో ధైర్యం నింపుతోంది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధన దశలో ఉన్న టీకాలు.. త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్న ఆస్ట్రాజెనెకా.. తమ ఔషధం చాలా తక్కువ ధరకే వస్తుందని, పంపిణీ కూడా తేలికేనని చెప్పింది. పైగా సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉందని చెప్పడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచింది. ఒక్కసారి టీకా వచ్చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు ఎత్తేసి ఆర్థిక వ్యవస్థలు వేగంగా పుంజుకుంటాయన్న నమ్మకమే బంగారం ధరల తగ్గుదలకు కారణం అవుతోంది.

అమెరికాలో తయారీరంగం భారీగా పుంజుకుంది. అగ్రరాజ్యంలో బిజినెస్ యాక్టివిటీ ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. డాలర్ బలం పుంజుకుంటోంది. అటు బైడెన్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలు కూడా పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ యెలెన్‌ను అమెరికా ట్రెజరీ సెక్రటరీగా నియమిస్తారని, త్వరలోనే ఉద్దీపన పథకం రావొచ్చన్న ఆశలు కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మెరుగుపడడంతో ఇన్వెస్టర్లు క్రమంగా బంగారంలో బదులు స్టాక్ మార్కెట్లు, ఇతర కమోడిటీస్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు 4 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి.

ఇండియా జీడీపీ తగ్గుదల కూడా అంచనా వేసినదానికంటే తక్కువే ఉండొచ్చని ఆర్బీఐ చెప్పింది. ఈ వార్తలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచుతున్నాయి. పైగా కరోనా కారణంగా ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయి. ప్రజలు నిత్యావసరాలు, అత్యవసరాలకే ఖర్చుపెట్టే పరిస్థితి ఉంది. విలాసాల కోసం అంతగా ఆలోచించడం లేదు. అందుకే, బంగారు ఆభరణాల కొనుగోళ్లు కూడా తగ్గాయి. పరిస్థితులు మెరుగయ్యి.. ఆదాయం పెరిగాక గాని బంగారం ధరలు పెరగక పోవచ్చంటున్నారు నిపుణులు. గత ఆగస్టులో 56వేల 200 రూపాయల ఆల్‌టైం గరిష్టస్థాయికి చేరిన 24 క్యారెట్ల బంగారం ధర.. ఇవాళ 50వేలకు అటు ఇటుగా ఉంది. త్వరలోనే 50వేల మార్క్ కిందకు వస్తుందని అంచనా వేస్తున్నారు. అటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story