RUPEE: పాతాళానికి పడిపోతున్న రూపాయి

రూపాయి.. రూపాయి ఏమిస్తావ్ అంటే.. ఏం ఇవ్వను. ఎందుకు రూపాయి అంతలా పడిపోతున్నావ్.. అమెరికా డాలర్ బలపడుతుంది. అమెరికా డాలర్ పై ఎందుకు ఆధారపడ్డావ్.. మీరు ఎగుమతులు భారీగా చేస్తున్నారు. ఎగుమతులు చేస్తే పడిపోతావా.. అలా ఏం లేదు.. దేశంలో ఎగుమతులకన్నా కూడా దిగుమతుల విలువ భారీగా పెరిగినప్పుడు నేను పడిపోతా. సరే.. ఇంకో ప్రశ్న.. ఆ నువ్వు అక్కడే ఆగిపో నేను మరింత పడిపోవాలి(పాతాళం దిశగా ప్రయాణిస్తూ)
గురువారం నాటి ట్రేడింగ్‌లో ఒక దశలో డాలర్‌తో పోలిస్తే మన కరెన్సీ విలువ ఏకంగా 28 పైసలు పడిపోయి 90.43 వద్ద సరికొత్త జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. క్రితం సెషన్లో రూపాయి విలువ 90.15 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్షీణత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, రూపాయి విలువ 90.70-91 మార్క్‌ను తాకనుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డాలర్ విలువ ప్రస్తుతం బలంగా మారుతుంది ఈ నేపథ్యంలోనే రూపాయి విలువ పడిపోవడం గమనించవచ్చు. అలాగే దేశంలో ఎగుమతులకన్నా కూడా దిగుమతుల విలువ భారీగా పెరిగినప్పుడు రూపాయి విలువ తగ్గిపోతుంది. దీంతోపాటు ఆర్థిక అనిశ్చితి ఏర్పడినప్పుడు కూడా రూపాయి విలువ భారీగా తగ్గుతుంది. రూపాయి విలువ కనుక పడినట్లయితే రోజువారి కొనుగోలు చేసే వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. వాటిలో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, విదేశాల్లో చదివే స్టూడెంట్స్ కు చాలా ఇబ్బందికరంగా మారుతుంది.
స్టాక్ మార్కెట్లో ప్రభావం
రూపాయి పతనం స్టాక్ మార్కెట్ సూచీలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం ప్రకటించబోయే ద్రవ్యపరపతి సమీక్షకు మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారు. దీని ఫలితంగా సూచీలు స్తబ్దంగా, చిన్న ఎత్తుపతనాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో 85,140 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 25,992 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
సామాన్యుడిపై భారం
రూపాయి విలువ పడటం వలన దేశ ఆర్థిక వ్యవస్థ మరియు సామాన్య జీవితంపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. భారత్‌లో దాదాపు 85% చమురు, ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనెలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. రూపాయి పడటం వల్ల ఈ దిగుమతి బిల్లులు పెరుగుతాయి. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఈ ప్రభావాన్ని నేరుగా చూస్తున్నారు. ఉదాహరణకు, 50,000 డాలర్ల వార్షిక ఫీజు గతంలో ₹80 రూపాయిల వద్ద సుమారు ₹40 లక్షలు కేవలం కాగా, ఇప్పుడు ₹90 రూపాయిల వద్ద ₹45 లక్షలకు చేరుతోంది. అంతే కాకుండా, విదేశీ విద్య కోసం డాలర్ల లోన్లను తీసుకున్నవారు కూడా రూపాయ్లలో ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. ముడి చమురు ధరలు పెరగడం వలన పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఇది రవాణా ఖర్చులను పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఎగబాకటానికి కారణం అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

