DANGER: ఆర్థిక వ్యవస్థకి డేంజర్ బెల్స్!

ఈ ఏడాది ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27)లో దేశ జీడీపీ వృద్ధిరేటు తగ్గే అవకాశముందని, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల కోతలకు దూరంగా ఉండవచ్చని ప్రముఖ విదేశీ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో భారత ఆర్థిక వృద్ధిరేటు 7.3 శాతంగా ఉండొచ్చని అంచనాలుండగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అది అర శాతం తగ్గి 6.8 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 2026 క్యాలెండర్ సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.7 శాతంగా ఉండొచ్చని తాజా నివేదిక వెల్లడించింది.
ముందు రోజుల్లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగే అవకాశముందని గోల్డ్‌మన్ సాచ్స్ హెచ్చరించింది. ఈ ఏడాది సగటు ద్రవ్యోల్బణం 3.9 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఇది ద్రవ్యోల్బణం 4 శాతాన్ని మించకూడదన్న ఆర్బీఐ లక్ష్యానికి సమీపంలోనే ఉంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో ఆర్బీఐ కఠిన వైఖరినే కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో వడ్డీరేట్ల కోతలకు అవకాశాలు పరిమితంగానే ఉంటాయని అభిప్రాయపడింది. ధరల పెరుగుదలను అదుపులో ఉంచేందుకు రెపోరేటును మార్చకుండా ఆర్బీఐ సమీక్షలను ముగించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం రెపోరేటు 5.25 శాతంగా ఉంది. అయితే జీడీపీకి ఊతం ఇవ్వాలన్న ఉద్దేశంతో 25 బేసిస్ పాయింట్ల మేరకు కోత విధించే అవకాశం పూర్తిగా తోసిపుచ్చలేమని కూడా గోల్డ్‌మన్ సాచ్స్ పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతంగా నమోదవుతుందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.తయారీ, సేవల రంగాల ప్రదర్శన మెరుగ్గా ఉండటంతో, గత ఆర్థిక సంవత్సరం (2024–25)లోని 6.5 శాతం వృద్ధితో పోలిస్తే దాదాపు ఒక శాతం పెరుగుదల కనిపించవచ్చని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ జాతీయ ఆదాయంపై విడుదల చేసిన ముందస్తు అంచనాలో పేర్కొంది. తయారీ, నిర్మాణ రంగాల్లో వృద్ధిరేటు 7 శాతంగా ఉండొచ్చని అంచనా వేయగా, వ్యవసాయం, అనుబంధ రంగాలు, విద్యుత్తు, గ్యాస్, నీటి సరఫరా వంటి యుటిలిటీ రంగాల్లో మాత్రం స్వల్ప వృద్ధికే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే బడ్జెట్ రూపకల్పనలో ఈ అంచనాలను మోదీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
దేశ ఆర్థిక వృద్ధికి కీలకమైన కొత్త పెట్టుబడులు గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలు భారత్‌పై అదనపు ఒత్తిడి తెస్తున్నాయి. వాణిజ్య ఒప్పందాల ఆలస్యం, రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల కొనసాగింపును కారణంగా చూపుతూ అమెరికా టారిఫ్‌ల భారం పెంచుతోంది. ఇటీవల భారత్‌పై సుంకాలు మరింత పెంచుతామని హెచ్చరించడంతో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడితే కొంత ఊరట లభించవచ్చని, అయితే అది భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆధారపడి ఉంటుందని గోల్డ్‌మన్ సాచ్స్ స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

