Stock Market: అదానీ ఎఫెక్ట్...

ఎనిమిదేళ్లుగా మార్కెట్‌పై ఎనలేని విశ్వాసం చూపిన ఇన్వెస్టర్లలో తొలిసారి భయం ఛాయలు కన్పిస్తున్నాయి. కరోనా తరవాత మార్కెట్లలో అదానీ షేర్ల పతనం.. సాధారణ ఇన్వెస్టర్లను షాక్‌కు గురి చేసింది. అదానీ షేర్లతో మొదలైన పతనం.. బ్యాంకింగ్, ఎల్ఐసీతో పాటు ఇతర కంపెనీలకు పాకింది. కేవలం రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద 11 లక్షల కోట్లు తగ్గింది. బడ్జెట్ ముందు కరెక్షన్ కోసం ఏదో ఒక సాకు కోసం ఎదురు చస్తున్న షార్ట్ సెల్లర్స్‌కు అదానీ వ్యవహారం కలిసి వచ్చింది. దీంతో మార్కెట్‌లో భారీ పతనం వచ్చింది. అదానీకి రుణాలు ఇచ్చిన బ్యాంకుల షేర్లను ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు. ఎంతో పటిష్ఠమైన ఎస్‌బీఐకి కూడా భారీ నష్టాలు తప్పలేదు. నిఫ్టి ఒకటిన్నర శాతం నష్టపోగా.. బ్యాంక్ నిఫ్టి 3 శాతంపైగా నష్టపోవడానికి అదానీనే కారణం. 2016లో అదానీ చేసిన అప్పుల్లో 86 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చినవే. 2022 నాటికి ప్రభుత్వ బ్యాంకుల రుణాలు 40 శాతానికి తగ్గాయి. మరో 37 శాతం అప్పులు బాండ్ల ద్వారా అదానీ గ్రూప్ సేకరించింది. దీంతో మార్కెట్ పతనం బ్యాంకింగ్ రంగంపై తీవ్రంగా ఉంది. ఇక అసలే అంతంత మాత్రం ఉన్న ఎల్‌ఐసీ షేర్‌కు అదానీ ఎపిసోడ్ చుక్కలు చూపింది. కేవలం రెండు రోజుల్లో 18వేల కోట్ల రూపాయలు ఆవిరి అయిపోయాయి. అదానీ షేర్ల దెబ్బతో ఇన్వెస్టర్లలో కంగారు మొదలైంది. అదానీకి సంబంధించి గత కొన్ని నెలల నుంచి నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో అదానీ షేర్లను అనుమానంగా చూస్తున్న ఇన్వెస్టర్లు.. ఇప్పుడు తెగ అమ్ముతున్నారు. దీంతో మొత్తం మార్కెట్ దిశపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిఫ్టి ఈ గండాన్ని తట్టుకుంటుందా అన్న చర్చ మార్కెట్‌లో మొదలైంది. బడ్జెట్ కాపాడకపోతే స్టాక్ మార్కెట్‌కు గడ్డు కాలమే. దీంతో వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు చాలా కీలకం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com