Stock Market Today: కుప్పకూలిన దేశీయ మార్కెట్లు.. ఆవిరైన లక్షల కోట్ల సంపద..

Stock Market Today: రష్యా, ఉక్రెయిన్ టెన్షన్స్‌తో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. 2022లో తొలిసారిగా కనిష్టానికి దేశీయ మార్కెట్లు పడిపోయాయి. అన్ని రంగాల సూచీలు డే కనిష్ట స్థాయి వద్ద కదలాడుతోన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1600, నిఫ్టీ 480 పాయింట్ల నష్టంతో ఉన్నాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఐటీ, పవర్, రియాల్టీ సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనై 2 నుంచి 4శాతం నష్టంతో ట్రేడవుతోన్నాయి. రష్యా దెబ్బకు చిన్న స్టాక్స్ అన్నీ కుదేలైపోతున్నాయి.
బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు 3శాతం పైగా నష్టంతో ఉన్నాయి. దాదాపు 200 స్టాక్స్ 52వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. వొకార్డ్, సన్ టీవీ, ఉజ్జీవన్ ఫైనాన్షియల్, సద్భావ్ ఇంజనీరింగ్, గ్రాన్యూల్స్ ఇండియాలు భారీ కరెక్షన్‌కు గురయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని ఈక్విటీ మార్కెట్లన్నీ కుప్పకూలుతున్నాయి.
తాజాగా చమురు ధరలు ఏడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా సెంచరీ మార్క్‌ను క్రాస్ చేసింది. పుతిన్ ప్రకటన తర్వాత బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 100 డాలర్లను అధిగమించింది. బ్రెంట్ చివరసారిగా సెప్టెంబర్ 2014లో 100 డాలర్ల మార్కును దాటింది. ఉక్రెయిన్‌పై సైనికచర్య ప్రారంభించామని, ఇందులో ఎవరూ జోక్యం చేసుకోరాదని, ఎవరైనా సరే జోక్యం చేసుకుంటే వారిపై కూడా ప్రతికారం తీర్చుకుంటామని రష్యా ప్రకటించింది.
ఉక్రెయిన్ మిలిటరీ ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోవాలని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ పిలుపునిచ్చారు. ఇటీవలి లాక్‌డౌన్‌ల తర్వాత ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కోలుకుంటుండగా తాజాగా యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను మళ్ళీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాల ద్రవ్యోల్బణం రేట్లు అదుపుతప్పే ప్రమాదముందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com