Suzuki Bike: స్పోర్ట్స్ బైక్ ప్రియుల కోసం మార్కెట్లోకి మరో కొత్త వాహనం..

Suzuki Bike: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ కొత్త స్పోర్ట్స్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. జపాన్‌కు చెందిన పురాతన కత్తిని స్ఫూర్తిగా తీసుకుని ఈ బైక్‌కు కటానా అని పేరు పెట్టారు. దీని ధర రూ.13.61 లక్షలు (ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. ఇందులో 999 సీసీ లిక్విడ్ కూల్డ్ డీఓహెచ్‌సీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 152 పీఎస్ పవర్‌ను, 106 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్ గేర్ బాక్స్ అమర్చారు.
దేశంలో బిగ్ బైక్స్ విభాగంలో తమ ఫోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో భాగంగా కటానాను తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ బైక్ మెటాలిక్ మెస్టిక్ సిల్వర్, మెటాలిక్ స్టీలర్ బ్లూ రంగుల్లో లభ్యమవుతుంది. ఇందులో సుజుకీ ఇంటిలిజెంట్ రైడర్ సిస్టమ్, సుజుకీ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, సుజుకీ డ్రైవ్ మోడ్ సెలెక్టర్‌లో ఆర్‌పీఎం అసిస్ట్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. యాక్టివ్, బేసిక్, కంఫర్ట్ అంటూ మూడు రకాల త్రోటల్ కంట్రోల్స్ ఉంటాయి. భారత్‌లో విడుదలైన బీఎండబ్ల్యూ ఎఫ్ 900 ఎక్స్ఆర్, కవాస్కీ నింజా 1000 ఎస్ఎక్స్‌కు ఈ బైక్ పోటీ ఇవ్వనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com