TARIFFS: మొబైల్ రీఛార్జ్‌లపై మళ్లీ మోత.!

సామాన్యులకు మరో షాక్ తగలనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలతో నానా కష్టాలు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు మరో భారం పడనుంది. టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను మళ్లీ పెంచే సంకేతాలు ఇస్తుండటంతో సామాన్య వినియోగదారులపై మోపబడే భారం మరింత పెరిగే అవకాశముంది. గతేడాదిలో రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచిన మొబైల్ నెట్వర్క్ కంపెనీలు మరోసారి పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరికి దేశీయ టెలికాం సంస్థలు మొబైల్ టారిఫ్‌లను 10-12 శాతం పెంచే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్, మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రికార్డు స్థాయిలో యాక్టివ్ సబ్స్క్రైబర్లు పెరగడం, 5జీ సదుపాయాల నేపథ్యంలో ఈ పెంపు ఉండొచ్చని చెబుతున్నారు.
74 లక్షల మంది సబ్స్క్రిప్షన్
దేశంలో మొబైల్ యాక్టివ్ యూజర్ల సంఖ్య మే నెలలో రికార్డు స్థాయిలో పెరిగింది. ఆ ఒక్క నెలలోనే 74 లక్షల మంది కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. 29 నెలల్లో ఇదే గరిష్ఠం కావడం గమనార్హం. దీంతో మొత్తం యాక్టివ్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఏకంగా 108 కోట్లకు చేరువైంది. ఆ నెలలో రిలయన్స్ జియోలో కొత్తగా 55 లక్షల మంది చేరగా.. ఎయిర్‌టెల్‌కు 13 లక్షల మంది కొత్త వినియోగదారులు వచ్చారు. దీంతో యూజర్ల సంఖ్య పెరగడంతో టారిఫ్‌ల పెంపుపై టెలికాం సంస్థలు దృష్టి సారించినట్లు ఆర్థిక సేవల సంస్థ జెఫెరీస్ వెల్లడించింది.
ఈ ఏడాది 10-12 శాతం పెంచే అవకాశం
గతేడాది జులైలో బేస్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు సగటున 11-23 శాతం పెరిగాయి. ఈ ఏడాది చివరికి మరో 10-12 శాతం పెంచే అవకాశం ఉంది. అయితే, ఈసారి బేస్ ప్లాన్ల జోలికి పోకపోవచ్చని తెలుస్తోంది. మధ్య, ఉన్నత శ్రేణి ప్లాన్లపై ఛార్జీలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా డేటా వినియోగం, డేటా వేగం, డేటాను వినియోగించే నిర్దిష్ట సమయాల ఆధారంగా ఈ పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. కొత్త రీఛార్జ్ ప్యాక్స్ డేటాలో భారీగా కోత పెట్టే అవకాశం కనిపిస్తోంది. డేటా ప్యాక్‌లను ప్రత్యేకంగా కొనుగోలు చేసేలా వీటిని రూపొందించనున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మొబైల్ టారిఫ్‌లలో మార్పులు అవసరమని ఇప్పటికే ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా ఎగ్జిక్యూటివ్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
టైర్ సిస్టమ్ ప్రకారం కొత్త ధరల విధానం?
ప్లాన్ ధరలు మళ్లీ పెరగనున్నప్పటికీ, ఇది అందరికీ ఒకేలా ఉండబోదని, టైర్ సిస్టమ్ ఆధారంగా వేర్వేరు ధరలు ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారుడు ఎంత డేటా వాడుతున్నాడో, ఏ సమయంలో వాడుతున్నాడో ఆధారంగా ప్లాన్ ధరలు నిర్ణయించబోతున్నారు. ఈ విధానం ద్వారా తక్కువ వినియోగదారులకు తక్కువ ఛార్జీలు, ఎక్కువ వినియోగదారులకు ఎక్కువ ఛార్జీలు ఉండేలా చేయనున్నారు.
ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ ఇప్పటికే ప్రకటించినట్లు 'ఒకే సైజ్ అందరికీ సరిపోతుంది' అన్న పాత మోడల్ ఇక పనిచేయదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారుల అవసరాలు భిన్నంగా ఉండటంతో వారికి తగిన ప్రకారమే టారిఫ్‌లను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే, ప్లాన్ ధరలు పెరిగిన తర్వాత వినియోగదారులపై మునుపటి కంటే ఎంతవరకు భారం పడబోతుందనేది మాత్రం కంపెనీలు ఇంకా స్పష్టంగా చెప్పలేదు. అయితే, టారిఫ్ రేట్ల పెంపు తప్పనిసరి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com