Tech Mahindra: నిరాశ పరిచిన టెక్ మహీంద్రా త్రైమాసిక ఫలితాలు, షేర్లు డౌన్

Tech Mahindra: నిరాశ పరిచిన టెక్ మహీంద్రా త్రైమాసిక ఫలితాలు, షేర్లు డౌన్
మార్కెట్ ఆరంభంలో 5 శాతానికి పైగా ధరలు పడిపోయాయి

స్టాక్ మార్కెట్లో భారత ఐటీ సేవల కంపెనీ టెక్ మహీంద్రా షేర్లు దారుణంగా పడిపోయాయి. నిన్న కంపెనీ మొదటి త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో ఆ ప్రభావం గురువారం టెక్ మహీంద్రా షేర్లపై పడింది. మార్కెట్ ఆరంభంలో 5 శాతానికి పైగా ధరలు పడిపోయాయి.బీఎస్ఈలో 1,100.05 వద్ద ప్రారంభమైంది. నిన్నటి రోజున 1144.05 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో కనిష్ఠంగా 1082.55 వద్ద ట్రేడ్ అయింది.తర్వాత కోలుకుని నష్టాల్ని తగ్గించుకుంటూ వెళ్తోంది.


నిన్న ప్రకటించిన ఫలితాలు ముదుపర్లను నిరుత్సాహ పరిచాయి. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆదాయం రూ.13,159 కోట్లతో 4.1 శాతం తగ్గింది. ఈ త్రైమాసికానికి కన్సాలిడేట్ PAT 38 శాతం తగ్గి రూ.693 కోట్లుగా నమోదుచేసింది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 2.7 శాతం తగ్గడంతో, జూన్ 30 నాటికి 1,48,297 మంది ఉద్యోగులు ఉన్నారు.

కంపెనీ ఎబిటా 1,338 కోట్లతో 33.8 శాతం తగ్గింది. నికర నూతన కాంట్రాక్ట్ విలువ గత త్రైమాసికంలో 592 మిలియన్ డాలర్లు ఉండగా, ప్రస్తుతం 359 మిలియన్ డాలర్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 802 మిలియన్ డాలర్లు.

సెగ్మెంట్ల వారీగా చూస్తే కమ్యూనికేషన్, మీడియా, వినోద రంగం పేలవంగా రాణించింది. BFSI, రిటైల్, ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్ రంగాల్లో కూడా ఆదాయం తగ్గింది. తయారీ రంగం మాత్రమే గత త్రైమాసికంతో పోలిస్తే 1.8 శాతం ఆదాయం పెంచుకుంది. టెక్నాలజీ విభాగం ఆదాయం కూడా స్వల్పంగా 0.1 శాతంగా పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story