Tesla-India: భారత్‌లో టెస్లా కారు ధర రూ.20 లక్షలు..!

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) తయారీ సంస్థ టెస్లా అతి త్వరలోనే భారత్‌లో అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్‌లో స్థానికంగానే టెస్లా(Tesla) కార్లను తయారుచేయడానికి భారత ప్రభుత్వంతో సంప్రదింపులు, ప్రతిపాదనలు ముందు పెట్టిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే తమకు ట్యాక్స్ బెనిఫిట్స్, రాయితీలు ఇవ్వాలన్న టెస్లా ప్రతిపాదనలను రెవెన్యూ అధికారులు తిరస్కరించారు.

"టెస్లా కంపెనీకి ఎటువంటి డ్యూటీ ట్యాక్సులు మినహాయింపులు ఇవ్వాలన్న ఆలోచనలు లేవు" అని రెవెన్యూ కార్యదర్శి మల్హోత్రా స్పష్టం చేశాడు.

మొదటగా టెస్లా కార్లను భారత్‌కి ఎగుమతి చేసి, భారత మార్కెట్‌లో ఈవీ(EV) కార్ల మార్కెట్‌ను అంచనా వేయాలనే ఆలోచన చేసింది. భారత్‌లో దిగుమతి చేసుకున్న EV కార్లపై 100 శాతం దాకా పన్నులు వసూలు చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వం ట్యాక్స్ విషయంలో కచ్చితంగా ఉండటంతో భారత్‌లోనే సొంతంగా కార్ల తయారీకి పూనుకుంది.


సంవత్సరానికి 5 లక్షల కార్ల యూనిట్ల సామర్థ్యంతో భారత్‌లో ప్లాంట్ పెట్టనున్నారు. భారత్‌లో టెస్లా ప్రారంభ ధరలు రూ.20 లక్షలుగా ఉండవచ్చని అంచనాలున్నాయి. ఈ ధరలు భారత్‌లో ప్రస్తుతం అతి తక్కువ ధరల్లో లభించే ఇతర ఎలక్ట్రిక్ కార్ల(Electric Vehicle) కన్నా రెట్టింపుగా ఉంటాయి. కార్ల తయారీతో పాటుగా సొంతంగానే బ్యాటరీ ఉత్పత్తి చేసే భారీ ప్లాంట్ కూడా నెలకొల్పాలన్న ప్రణాళికతో రానున్నారు.


గత నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక అమెరికా పర్యటనలో టెస్లా అధినేత ఎలన్ మస్క్‌(Elon Musk)తో భేటీ అయ్యారు. భారత్‌లో గణనీయమైన పెట్టుబడులు పెట్టాలని మస్క్‌ని కోరడంతో ఇప్పుడు ప్లాంట్ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు.

భారత్‌లో ప్లాంట్ పెట్టాలన్న టెస్లా కంపెనీ ప్రయత్నాలు విజయవంతం అయితే దేశంలో మారుతీ, హ్యుందాయ్‌ల తర్వాత అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించనుంది.

Tags

Read MoreRead Less
Next Story