21 March 2021 5:26 AM GMT

Home
 / 
బిజినెస్ / Home Loan..'ఇల్లు'...

Home Loan..'ఇల్లు' కొనుగోలు.. 'హౌసింగ్ లోన్' గురించి తెలుసుకోవలసిన విషయాలు..

Home Loan..గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయంలో సగభాగం ఇంటి రుణానికే పోతుంది.

Home Loan..ఇల్లు కొనుగోలు.. హౌసింగ్ లోన్ గురించి తెలుసుకోవలసిన విషయాలు..
X

Home Loan

ఉండడానికి ఓ ఇల్లు కావాలి. కనీసం ఓ చిన్న ఇల్లు కొందామన్నా లక్షల్లో ధరలు. లోన్ తీసుకోక తప్పని పరిస్థితి. అసలు మనం కొనాలనుకుంటున్న ఇల్లు ఎంత చెబుతున్నారు. మన జీతం ఎంత.. లోన్ తీసుకుంటే కట్టాల్సింది ఎంత.. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాంకులు ఇల్లు కొనుక్కోండి రుణాలు ఇస్తామంటూ వెంటబడుతుంటాయి. ఏదేమైనా ఇల్లు కొనుగోలు చేసే ముందు ఓసారి వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. హౌసింగ్ లోన్ అనేది ఓ దీర్ఘకాలిక ప్రక్రియ.. కాబట్టి గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయంలో సగభాగం ఇంటి రుణానికే పోతుంది. ముందు ముందు ఆర్థిక బాధలు తలెత్తకుండా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే ఇల్లు కొన్న ఆనందం మిగులుతుంది.

హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు రుణ గ్రహీత పరిశీలించాల్సిన కొన్ని అంశాలు..

1. ఏది ఎంపిక చేసుకోవాలి

వడ్డీ రేటు తక్కువగా ఉండే ఆర్థిక సంస్థల గురించి తెలుసుకోవాలి. అంతే కాకుండా రెండు రకాల వడ్డీ రేట్లు.. 1. ప్లోటింగ్ 2. ఫిక్స్ లలో ఏది ఎంపిక చేసుకోవాలనేది కూడా అంతే ముఖ్యం. ప్లోటింగ్ రేట్లు.. ఆర్బీఐ బేస్ రేట్లలో మార్పులు చేసినప్పుడు మార్కెట్ పరిస్థితులకు లోబడి కాలానుగుణంగా మారుతుంటాయి. భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలు ఉన్నప్పుడు ఫ్లోటింగ్ రేట్లు ఎంచుకోవడం మంచిదని ఆర్థికనిపుణులు సిఫారసు చేస్తారు. ఫిక్స్‌డ్ రేట్లు.. ఇందులో వడ్డీ రేట్లు ఎప్పుడూ మారవు. దీర్ఘకాలంలో సొమ్ము ఆదాచేస్తాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలు వచ్చినప్పుడు ఫిక్స్‌డ్ రేటు ఎంచుకోవడం మేలు. ఫిక్స్‌డ్ వడ్డీ రేటులో రుణ గ్రహీతలు తమకు అనుగుణంగా ఉండేలా బడ్జెట్ రూపొందించుకోవచ్చు.

2. వ్యవధి

సాధారణంగా హౌసింగ్ లోన్ వ్యవధి 30 ఏళ్ల వరకు వుంటుంది. ఈఎంఐ భారం తక్కువగా ఉండాలనుకుంటే దీర్ఘకాలిక వ్యవధి ఎంచుకోవడం మేలు. వడ్డీ చెల్లింపు తగ్గించుకోవాలనుకుంటే స్వల్ప వ్యవధి అనుకూలం. ఉదాహరణకు రూ.80 లక్షల హౌసింగ్ లోన్‌ను 15 సంవత్సరాల వ్యవధికి తీసుకుంటే వడ్డీ 8.25 శాతం లెక్కన తీసుకుంటే మీరు కట్టే నెలవారీ ఈఎంఐ రూ.77,611 ఉంటుంది. అలాగే చెల్లించే వడ్డీ మొత్తం రూ.59,70,000గా ఉంటుంది. ఒకవేళ లోన్ కాల పరిమితిని 20 ఏళ్లకు పెంచినట్లయితే ఈఎంఐ రూ.68,165 కట్టాల్సి వస్తుంది. అప్పుడు చెల్లించే వడ్డీ రూ.83,59,760 ఉంటుంది. ఈఎంఐ రూపంలో కట్టే మొత్తం ఆదాయంలో 30 శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. తమ వయసు, ఆదాయ అవకాశాలు, తాము పూర్తి చేయాల్సిన ఇతర బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని లోన్ వ్యవధిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

3. డౌన్ పేమెంట్

రుణం ఇచ్చే సంస్థలు మీరు కొనుగోలు చేసిన ఇంటి విలువలో కొంత మొత్తాన్ని మాత్రమే రుణంగా ఇస్తాయి. మిగిలిన మొత్తాన్ని దరఖాస్తు దారు స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆస్తి ధర, దరఖాస్తుదారు అర్హతను బట్టి ఇది 75 శాతం నుంచి 90 శాతం మధ్యన ఉంటుంది. రుణ గ్రహీతలు కనీస మొత్తాన్ని డౌన్ పేమెంట్‌గా చెల్లించవచ్చు లేదా ఎక్కువ మొత్తాన్ని చెల్లించవచ్చు. ఎంత రుణం తీసుకోవాలి.. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అనేది తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. డౌన్ పేమెంట్ ఎక్కువ చెల్లిస్తే హోమ్ లోన్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

4. ఎక్‌స్ట్రా ఛార్జీలు

హోమ్ లోన్‌పై కేవలం వడ్డీ మాత్రమే కాదు.. దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజులు, లేట్ పేమెంట్ పెనాల్టీలు, ఫోర్ క్లోజర్ ఛార్జీలు కూడా ఉంటాయి. ప్రారంభంలోనే వీటిపై చర్చించడం మంచిది.

ఫిక్స్ రేట్ హోమ్ లోన్ పైన మాత్రమే ఫోర్ క్లోజర్ లేదా ప్రీపేమెంట్ ఛార్జీలు వర్తిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఫిక్స్డ్, ఫ్లోటింగ్ రేటు విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రీపేమెంట్ ఆప్షన్ ఉండేలా చూసుకోవాలి. తద్వారా వ్యవధి తగ్గించుకోవచ్చు. దాని వలన పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది.

5. క్రెడిట్ స్కోర్

హోమ్ లోన్ అప్లై చేయడానికి ముందు దరఖాస్తుదారు తన క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన స్కోర్ అంటే 750 కంటే ఎక్కువ వుంటే తక్కువ వడ్డీ రేట్లకు రుణాన్ని పొందవచ్చు. హోమ్ లోన్ తీసుకోవడానికి ముందు ఇంతకు ముందు ఉన్న అన్ని బకాయిలు క్లియర్ చేసుకుంటే మంచిది. అవసరమైన డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి. అలాగే లోన్ఒప్పంద పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. హోమ్ లోన్ తీసుకోవడం అనేది చాలా పెద్ద నిర్ణయం. రానున్న రోజుల్లో వారి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. అందుకే అన్ని విషయాలు వివరంగా తెలుసుకుని ముందుకు అడుగు వేయాలి.

Next Story