TRUMP TAX: ట్రంప్ టారిఫ్‌లతో బిలియనీర్లకు నష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. టారిఫ్‌ల ఎఫెక్ట్ బిలియనీర్లపైనా తీవ్రంగా పడింది. ప్రపంచవ్యాప్తంగా 500 మంది కుబేరుల మొత్తం సంపద 208 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.17 లక్షల కోట్లు) కరిగిపోయింది. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ సంపద ఏకంగా 17.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.5లక్షల కోట్లు) మేర నష్టపోయింది. జుకర్‌బర్గ్ మొత్తం సంపదలో ఈ నష్టం 9శాతానికి సమానం. అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ వ్యక్తిగత నికర సంపద 15.9 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.3లక్షల కోట్లు) తరిగిపోయింది. ట్రంప్‌నకు అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్ ఆస్తి కూడా భారీగా తగ్గిపోయింది. టెస్లా షేర్లు 5.5శాతం మేర తగ్గడంతో ఎలాన్ మస్క్ సంపద 11 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.93వేల కోట్లు) మేర కరిగిపోయింది. డెల్ సీఈఓ మైఖేల్ డెల్ సంపద 9.53 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.81వేల కోట్లు), ఒరాకిల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ల్యారీ ఎలిసన్ ఆస్తి 8.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.69వేల కోట్లు) మేర తగ్గింది. ఎన్విడియా సీఈఓ జేసెన్ హువాంగ్‌కు 7.36 బిలియన్ డాలర్లు, గూగుల్ మాజీ సీఈఓ ల్యారీ పేజ్‌కు 4.79 బిలియన్ డాలర్లు, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌కు 4.46 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. ఫ్రాన్స్ సంపన్నుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 6 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ సూచీ వెల్లడించింది.
ట్రంప్ సుంకాలు.. ఐఫోన్ల ధర పెంపు?
ఆదాన్ న్యూస్: యాపిల్ ఈ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు ఐఫోన్ల ధరలను 30% నుంచి 40% వరకు పెంచవచ్చని నిపుణులు తెలిపారు. చాలా ఐఫోన్‌లు ఇప్పటికీ చైనాలో తయారవుతున్నాయి. దీనిపై 34% అదనపు సుంకం విధించారు. చౌకైన ఐఫోన్ 16 మోడల్ ధర దాదాపు $1,142, ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర దాదాపు $2,300 ఉండవచ్చని నిపుణులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 'అమెరికా ఫస్ట్' అనే నినాదంతో, ప్రపంచ వాణిజ్యాన్ని తన నియమాలకు బానిస చేయాలన్న దిశగా సాగుతున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక దేశాలపై టారిఫ్ విధించారు. ఈ సుంకాల విధింపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాల ఆర్థివక వ్యవస్థను కుదిపేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com